వైసీపీ దౌర్జన్యాలు, విధ్వంసాలపై చర్యలు తీసుకోండి
అమరావతి : స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైసీపీ నాయకులు సాగిస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్.రాజశేఖర్, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌తో కూడిన బృందం శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసింది.
హనుమంతునిపాడు, కృష్ణగిరి, కురవపల్లి, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, యడ్లపాడు, చౌడేపల్లి, ధర్మవరం, మాచర్ల ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సాగించిన దాడులు, విధ్వంసాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది. టీడీపీ అభ్యర్థులు, పోలీసులపై వైసీపీ గూండాలు సాగించిన దౌర్జన్యాలు, బెదిరింపులు, వాహనాల ధ్వంసానికి సంబంధించిన స్పష్టమైన వీడియో ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఎస్‌ఈసీకి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు.
‘స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ పెద్ద ఎత్తున కుట్ర పన్నింది. ఎన్నికలు జరగకుండా నిలిపివేయాలనే దురుద్దేశంతో తప్పుడు పిటిషన్లు, దొంగ సాక్ష్యాలు సృష్టించి కోర్టులను ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అత్యంత బాధ్యతాయుతంగా అమలు చేసింది. వైసీపీ చర్యలను పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాం’ అని వర్ల తెలిపారు.









Comments