• Aug 25, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) తన భవిష్యత్‌పై అత్యంత ఆశాభావంతో ఉంది. 2030 జూలై 1న ప్లాటినం జూబ్లీ (75వ వార్షికోత్సవం) జరుపుకునే నాటికి తమ బ్యాంకు వ్యాపారం ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపై రూ.200 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని బ్యాంకు చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. అలా అని తామేమీ ప్రత్యేక లక్ష్యమేమీ పెట్టుకోలేదన్నారు. ప్రస్తుత వ్యాపార వృద్ధి రేటు ఆధారంగా తాను ఈ విషయం చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌ త్రైమాసికంలో ఎస్‌బీఐ వ్యాపారం రూ.110.01 లక్షల కోట్లకు చేరింది.

    దేశంతో పాటు మా అభివృద్ధి

    ఎస్‌బీఐ వ్యాపార అభివృద్ధి.. దేశ ఆర్థిక వృద్ధితో ముడిపడి ఉందని శ్రీనివాసులు శెట్టి స్పష్టం చేశారు. దేశ జీడీపీ ఏటా 7 నుంచి 8 శాతం చొప్పున పెరిగితే ఎస్‌బీఐ ఆస్తి-అప్పుల పట్టీ (బ్యాలెన్స్‌ షీట్‌) కూడా ఏటా 11 నుంచి 12 శాతం చొప్పున పెరుగుతుందన్నారు. దీంతో ప్రతి ఆరేళ్లకు తమ బ్యాలెన్స్‌ షీట్‌ రెట్టింపు అవుతుందన్నారు. ‘ ఈ లెక్కన చూసుకుంటే 2030 నాటికి మా వ్యాపారం రూ.200 లక్షల కోట్లకు చేరడం పెద్ద కష్టమేమీ కాదు’ అని శెట్టి చెప్పారు.

    నాలుగు విషయాలపై ఫోకస్‌

    విజన్‌ 2030 కింద ఎస్‌బీఐ ఖాతాదారులు, ఉద్యోగులు, వాటాదారులతో పాటు ప్రభుత్వం, రెగ్యులేటర్ల ప్రత్యేక అవసరాలపై దృష్టి పెట్టినట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలనే లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఈ నలుగురి విషయంలోనూ అంతర్జాతీయ ప్రమాణాలు సాధిస్తామన్నారు. ఖాతాదారులకు సంబంధించి వారికి మంచి సేవల అనుభూతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి విధి నిర్వహణ విధివిధానాలను సులభతరం చేసి వారి నుంచి మరింత ఉత్పాదకత సాధించాలని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఉత్పాదకత, సామర్ధ్యాల పెంపు ద్వారా బ్యాంకు వాటాదారులకు మరింత విలువ జోడిస్తామన్నారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి దేశంలో అత్యున్నత బ్యాంకుగా తమ పాత్ర కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం దేశ పొదుపు మొత్తాల్లో నాలుగో వంతు మొత్తాన్ని ఎస్‌బీఐ ఒక్కటే సమీకరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ మొత్తాన్ని వ్యవసాయ, ఎంఎ్‌సఎంఈ, గ్రామీణ రుణాల ద్వారా అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్టు చెప్పారు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement