• Jul 27, 2026
  • NPN Log

    దుబాయ్‌ : తమపై అమెరికా ఇలాగే దాడులు కొనసాగిస్తూ ఉంటే.. ఆ దేశంపై 9/11 తరహా దాడులు చేస్తామని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) హెచ్చరించింది. అమెరికా జాతీయ సంతాప దినాలు జరుపుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం చేస్తామన్న ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ఐఆర్‌జీసీ ఈ ప్రకటన చేసింది. యుద్ధం కొనసాగితే అమెరికా పశ్చాత్తాప పడేలా దాడులు చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు పశ్చిమాసియా వ్యాప్తంగా వంతెనలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని పేర్కొంది. 2001 సెప్టెంబరులో అల్‌ఖైదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్‌ చేసి, వాటితో అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌) జంట భవనాలను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 3 వేల మందికిపైగా మరణించగా, మరో 25 వేల మంది గాయపడ్డారు. అమెరికా చివరిసారిగా అప్పుడే జాతీయ సంతాప దినాలు పాటించింది. ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తూ.. ఐఆర్‌జీసీ హెచ్చరికలు చేయడం గమనార్హం.

    అట్టుడుకుతున్న పశ్చిమాసియా..

    ఇరాన్‌పై అమెరికా దాడులు, గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు, మరోవైపు బాబ్‌ అల్‌ మందేబ్‌ జలసంధిలో చమురు నౌకలపై యెమెన్‌ హౌతీల దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గురువారం తెల్లవారుజామున ఇరాన్‌లోని అహ్వజ్‌, రామ్‌షిర్‌, అండిమెష్క్‌, దక్షిణ తీరప్రాంతంలోని పలు పట్టణాలపై అమెరికా దాడులు చేసింది. పలు కీలక వంతెనలు, రోడ్లను ధ్వంసం చేసింది. ఇరాక్‌, ఇరాన్‌ మధ్య రవాణాకు కీలకమైన సరిహద్దు పట్టణం షలామ్‌చె్‌హపైనా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, పదుల మంది గాయపడ్డారు. మరోవైపు జోర్డాన్‌, కువైట్‌, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై, విద్యుత్‌ వ్యవస్థలు, డీసాలినేషన్‌ (ఉప్పునీటి శుద్ధి) ప్లాంట్లపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు చేసింది.

    మీరు కన్ను తీస్తే.. మేం తల తీస్తాం..

    అమెరికా దాడులపై దీటుగా స్పందిస్తామని, కన్నుకు కన్ను అన్నట్టుగా ప్రతీకారం తప్పదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వ్యాఖ్యానించగా.. తమ అధ్యక్షుడు ట్రంప్‌ విధానం కన్నుకు తల తీయడమంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దీటుగా సమాధానమిచ్చారు. ఆలస్యం చేసినకొద్దీ ఇరాన్‌కు మరింత నష్టం తప్పదన్నారు.

    రెండు చమురు నౌకలపై దాడి

    గురువారం తెల్లవారుజామున సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లపై యెమెన్‌ హౌతీ రెబెల్స్‌ దాడి చేశారు. దీనితో ఆ మార్గంలో చమురు నౌకల ప్రయాణం నిలిచిపోయింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. యెమెన్‌ హౌతీలు వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులు చేసినా అందు కు ఇరాన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అటు ఇరాన్‌, ఇటు హౌతీలు భారీ స్థాయిలో మిలిటరీ శిక్షను అనుభవించాల్సి ఉంటుందన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement