అన్నం తింటే బరువు పెరుగుతారా?
బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది అన్నం తినడం పూర్తిగా మానేస్తారు. కానీ అలా చేయాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, బి-విటమిన్లు (థయామిన్, నియాసిన్, విటమిన్ B6), మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
పోషకాహార నిపుణుల ప్రకారం.. బియ్యంలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీంతో శరీరానికి ఎక్కువసేపు శక్తి అందుతుంది. ఆకలి త్వరగా వేయకుండా ఉండటంతో పాటు రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగడం, తగ్గడం కూడా తగ్గుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, ఏకాగ్రత పెరగడానికి కూడా సహాయపడుతుంది.
గ్లూటెన్ అలర్జీ లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి అన్నం మంచి ఆహారం. గోధుమ, బార్లీ వంటి ధాన్యాల్లో ఉండే గ్లూటెన్ కొందరికి జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. అయితే బియ్యంలో సహజంగానే గ్లూటెన్ ఉండదు. అందుకే గ్లూటెన్-రహిత ఆహారం తీసుకునే వారికి ఇది మంచి ఎంపిక. అలాగే బియ్యం తక్కువ ఖర్చుతో అందరికీ సులభంగా లభించే ఆహారం. అయితే అన్నాన్ని ఎక్కువగా కాకుండా పరిమితంగా తింటూ, దానితో పాటు పప్పులు, కూరగాయలు, ప్రొటీన్ ఆహారం కలిపి తీసుకుంటే మరింత ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలంటే అన్నం ఎలా తినాలి?
ఒక భోజనంలో అర కప్పు నుంచి ఒక కప్పు వరకు మాత్రమే అన్నం తినాలి.
పెద్ద ప్లేట్లో కాకుండా చిన్న గిన్నెలో వడ్డించుకుని తింటే పరిమాణం నియంత్రించుకోవచ్చు.
ప్లేట్లో సగం భాగం కూరగాయలు, పావు భాగం ప్రొటీన్ ఆహారం (పప్పులు, చేపలు, చికెన్, గుడ్లు, పనీర్, ఆకుకూరలు), మిగిలిన పావు భాగం మాత్రమే అన్నంతో నింపండి.
అన్నం వండిన తర్వాత 12 నుంచి 24 గంటలు ఫ్రిజ్లో ఉంచి, తర్వాత వేడి చేసి తింటే అందులోని కొంత పిండిపదార్థం రెసిస్టెంట్ స్టార్చ్గా మారుతుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవడం వల్ల కేలరీల శోషణ తగ్గి, పేగుల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
వీలైనంత వరకు తెల్ల బియ్యం బదులుగా బ్రౌన్ రైస్, ఎర్ర బియ్యం లేదా నల్ల బియ్యం తీసుకోవడం మంచిది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీంతో కడుపు ఎక్కువసేపు నిండిన భావన ఉంటుంది.
ఫ్రైడ్ రైస్, ఎక్కువ నూనె, క్రీమ్ లేదా చిక్కటి గ్రేవీలతో చేసిన రైస్ కంటే సాధారణంగా ఉడికించిన అన్నం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.










Comments