• Sep 20, 2026
  • NPN Log

    సాధారణంగా కూడళ్లలో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు చూస్తాం. కొన్నిచోట్ల రాజకీయ నేతల విగ్రహాలు కనిపించడం తెలిసిందే. కానీ స్కాట్లాండ్‌ లోని ఒక కూడలిలో మాత్రం విచిత్రంగా ఆవు విగ్రహం కనిపిస్తుంది. ఇలా ఆవు విగ్రహం పెట్టడం వెనక కథలోకి వెళ్తే...

    స్కాట్లాండ్‌ పాడి ఆవులకు ప్రసిద్ధి. అక్కడ ప్రతీ రైతు ఇంట పాడి ఆవు కనిపిస్తుంది. అలాంటి ఒక పాడి ఆవు స్కాట్లాండ్‌లోని లెండ్రం పట్టణంలో చరిత్రలో నిలిచిపోయింది. అందుకు సాక్ష్యంగా ప్రధాన కూడలిలో ఆ ఆవు విగ్రహం కనిపిస్తుంది.

     

    1911లో బ్రిటిష్‌ ప్రభుత్వం నేషనల్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో ఉద్యోగులు, యజమానులు... ఇరువర్గాల నుంచి కొంత మొత్తాన్ని చెల్లించాలి. ఒకవేళ అనారోగ్యం, నిరుద్యోగం వంటి పరిస్థితులు ఏర్పడితే... కార్మికులకు ప్రభుత్వ సహాయం అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినప్పటికీ, చాలా మంది స్కాటిష్‌ రైతులు దీనిని వ్యతిరేకించారు. దానిని వారు ఆర్థిక భారంగా భావించారు. టర్రిఫ్‌ ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులను తామే బాగా చూసుకుంటున్నామని, వారికి ప్రభుత్వ బీమా అవసరం లేదని అన్నారు.

    రైతు తిరుగుబాటు

    టర్రిఫ్‌లోని లెండ్రం ప్రాంతానికి చెందిన రైతు రాబర్ట్‌ ప్యాటర్సన్‌ ఈ పథకాన్ని బహిరంగంగా వ్యతిరేకించాడు. దీంతో అధికారులు ప్యాటర్సన్‌పై కేసు నమోదు చేసి జరిమానా విధించారు. ప్యాటర్సన్‌ అధికారులు విధించిన జరిమానా చెల్లించాడు. కానీ బకాయి మొత్తాన్ని చెల్లించ డానికి మాత్రం నిరాకరించాడు. దీంతో కోర్టు ప్యాటర్సన్‌కు చెందిన విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అధికా రులు ప్యాటర్సన్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రానికి వెళితే... అక్కడ వారికి విలువైన వస్తువు ఒక్కటే కనిపించింది. అదే ‘టర్రా కూ’ అని పిలిచే ఆవు. అధికారులు చేసేదేమి లేక ఆ ఆవును తీసుకెళ్లారు. ఇది ప్రజాగ్రహానికి కారణమైంది.

    వేలం వేయాలని చూస్తే...

    అధికారులు ఆ ఆవును వేలం వేసేందుకు మార్కెట్‌కు తీసుకెళ్లారు. కానీ స్థానిక వ్యవసాయ మార్కెట్లు వేలం వేయడానికి నిరాకరించాయి. స్థానిక వేలం నిర్వాహకులు కూడా ముందుకు రాలేదు. అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. బయట ప్రాంతం నుంచి ఒక వేలం నిర్వాహకుడిని తీసుకొచ్చి, పట్టణంలోని ప్రధాన కూడలిలోనే ఆవును వేలం వేసేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. వేలం రోజు టర్రిఫ్‌ పట్టణ కేంద్రంలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

    కుక్క అరుపు.... ఆవు పరుగు...

    వేలం జరిగే సమయానికి అక్కడ వాతావరణం వందలాది మందితో చాలా ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో కుక్క మొరగడంతో టర్రా కూ భయపడింది. తాడు తెంచుకుని వీధుల్లోకి పరుగెత్తింది. అంతే... పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతో అల్లర్లు మొదలయ్యాయి. ప్రజలు అధికారులపై తిరగబడ్డారు. కొంతమంది గుంపులుగా ఏర్పడి అధికారులపై పండ్లు, గుడ్లు విసిరారు. చివరకు ప్యాటర్సన్‌ సహా కొంతమందిని అరెస్టు చేశారు. వారిపై అబెర్డీన్‌లో విచారణ జరిగింది. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో అందరినీ నిర్దోషులుగా విడుదల చేశారు.

    పట్టుబడిన ఆవు

    బెదిరిపోయిన ఆవు కొంతసేపటికి సమీపం లోని ఒక కొట్టంలో కనిపించింది. దాన్ని పట్టుకుని అబెర్డీన్‌కు తీసుకెళ్లారు. చివరకు అక్కడ ఆవును వేలం వేశారు. కానీ ఆవు కథ అక్కడితో ముగిసిపోలేదు. టర్రిఫ్‌ ప్రజలందరూ కలిసి డబ్బులు సమకూర్చి ఆవును తిరిగి కొనుగోలు చేసి, ప్యాటర్సన్‌ కుటుంబానికి అప్పగించారు. ఆ రోజు టర్రిఫ్‌ పట్టణంలో భారీ వేడుక జరిగింది. సుమారు 3 వేల మంది ప్రజలు ఆవును చూడటానికి తరలివచ్చారు. రిబ్బన్లు, పూల దండలతో అలంకరించిన ఆవును పట్టణ వీధుల్లో ఊరేగించారు. అయితే ఆరేళ్ల తరువాత ఆ ఆవు చనిపోయింది. కానీ టర్రిఫ్‌ ప్రజలు మాత్రం ఆ ఆవును మరచిపోలేదు. కాలక్రమంలో ఆ ఆవు పట్టణానికి ఒక ప్రతీకగా మారింది. 1971లో లెండ్రం రోడ్డు పక్కన ఆవు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. 2000లో టర్రిఫ్‌ పట్టణ కేంద్రంలో ఆవు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రెండు ప్రధాన వీధులు కలిసే ఈ ప్రదేశాన్ని స్థానికులు ‘కూ కార్నర్‌’ అని పిలుస్తారు. ఇదీ ఆవు విగ్రహం వెనకాల ఉన్న కథ.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement