ఈపీఎస్ ప్రభుత్వ వైఫల్యం ఈపీఎఫ్‌ఓ నిర్లక్ష్యం
దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన లక్షలాది మంది కార్మికులకు, వృద్ధాప్యంలో భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్–1995), నేడు వారికే శాపంగా మారింది. అత్యున్నత స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం, ఈపీఎఫ్‌ఓ మొండి బ్యూరోక్రటిక్ ప్రతిఘటన కారణంగా, ఈ పథకం కార్మికుల జీవన ప్రమాణాలను కాపాడాలనే ప్రాథమిక లక్ష్యాన్ని పూర్తిగా విస్మరించింది. వ్యవస్థాగత లోపాలు దేశంలోని శ్రామిక వర్గాన్ని వంచించాయి.
ప్రభుత్వ, బ్యూరోక్రటిక్ వైఫల్యాల కలయిక దేశ కార్మికులను మూడు విధాలుగా వంచించింది. అధిక వేతనంపై కాంట్రిబ్యూషన్ చేసిన వారికి, నిబంధనలు మార్చి పింఛను పొందే హక్కును హరించడానికి యత్నిస్తున్నారు; కనీస పింఛను రూ.వెయ్యికి పరిమితం చేసి, డీఏ అంశాన్ని విస్మరించడం ద్వారా, దశాబ్దాల పాటు కష్టపడిన వారి వృద్ధాప్య జీవితాన్ని దారిద్య్రంలోకి నెట్టేశారు. ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడానికి ఈపీఎఫ్‌ఓ బ్యూరోక్రసీని ‘దోషి’గా చూపించి, రాజకీయంగా తప్పించుకునే ధోరణిని ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. ఈపీఎస్ రూపకల్పనలోనే కార్మికుల జీవన ప్రమాణాలను విస్మరించారు. ప్రస్తుతం ఈ పథకం కింద లభిస్తున్న కనీస పింఛను రూ. వెయ్యి మాత్రమే. ద్రవ్యోల్బణం, నేటి జీవన వ్యయాల దృష్ట్యా చూస్తే, ఈ మొత్తం కనీస అవసరాలను కూడా తీర్చలేదు. ఈ పథక రూపకల్పనలో జరిగిన అత్యంత పెద్ద లోపం– ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరిగే డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) అంశాన్ని పూర్తిగా విస్మరించడం. ప్రభుత్వ ఉద్యోగులకు జీవన వ్యయానికి అనుగుణంగా పెరుగుతున్న పెన్షన్ లభిస్తుంది. కానీ ఈపీఎస్ పింఛనుదారులకు పెన్షన్ స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఒక వ్యక్తి 1995లో రిటైర్ అయినప్పుడు ఆ డబ్బుకు ఉన్న విలువ 2025 నాటికి తీవ్రంగా తగ్గిపోతుంది. ఇది కార్మికులను వృద్ధాప్యంలో దయనీయ స్థితికి నెడుతోంది.
ఉన్నత పింఛన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ సంక్షోభాన్ని మరింత పెంచాయి. చట్టపరమైన లోపంతో ఉన్నా, కార్మికులకు అధిక పింఛన్ పొందే హక్కును కల్పించిన పేరా 11(3) నిబంధనను, 2014 సవరణ ద్వారా వెనుకటి తేదీ నుంచి తొలగించడానికి ప్రభుత్వం యత్నించింది. ప్రాథమిక హక్కులను, ముందే ఇచ్చిన అవకాశాన్ని ఇలా తొలగించడం అన్యాయమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చింది. చట్టాలను రూపొందించేటప్పుడే దీర్ఘకాలిక ఆర్థిక అంచనా వేయడంలో విఫలమై, ఆ వైఫల్యాన్ని సరిదిద్దడానికి రాజ్యాంగ విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకోవడం ప్రభుత్వ విధాన రూపకల్పనలో లోపం. సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఈపీఎఫ్‌ఓ బ్యూరోక్రటిక్ యంత్రాంగం ఆ తీర్పు స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. ఉన్నత పింఛన్ అమలుచేయడం వల్ల ఫండ్‌పై భారీ ఆర్థికభారం పడుతుందనే భయంతో, ఈపీఎఫ్‌ఓ అధికారులు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు ప్రక్రియలో సంక్లిష్టమైన, అసాధ్యమైన షరతులను (ఉదాహరణకు– ముప్పై ఏళ్ల క్రితం దాఖలు చేసిన పత్రాలను డిమాండ్ చేయడం) విధించారు. దీనివల్ల అర్హులైన పింఛనుదారులు, వృద్ధాప్యంలో కోర్టు ధిక్కార పిటిషన్లు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ప్రతిఘటన– న్యాయస్థానం ఆదేశాలను కూడా అధికారులు గౌరవించకుండా తమ సంస్థాగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేస్తుంది.
కనీస పింఛన్, కనీస జీవన ప్రమాణాలను కూడా కల్పించలేని ఒక సామాజిక భద్రతా పథకం, దేశంలోని శ్రామికవర్గానికి తీరని అన్యాయం చేసింది. దీనిని సరిదిద్దాలంటే, కేవలం చట్టపరమైన మార్పులు కాకుండా, ప్రభుత్వం నుంచి బడ్జెట్ మద్దతు, నిర్ణయాత్మక రాజకీయ సంకల్పం అవసరం. కానీ ప్రభుత్వం ఈపీఎఫ్‌ఓ అధిక పెన్షన్ అమలుచేయడం లేదని అధికారులపై నెపం నెట్టడం హాస్యాస్పదం. ఉన్నత పింఛన్ విషయంలో ఈపీఎఫ్‌ఓ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహ రించినా, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం, తొలగించకపోవడం చూస్తుంటే ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం అని తెలుస్తూనే ఉంది.









Comments