ఎల్ నినోతో ఎండుతున్న పైర్లు
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన రైతు ముల్లా మోదీన్ తన సొంత పొలం 4.50 ఎకరాలతో పాటు 10 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రెండెకరాల చొప్పున చౌళ, బెండ; నాలుగెకరాల్లో ఉల్లిసాగు చేశారు. మరో నాలుగు ఎకరాల్లో ఇంకా విత్తు వేయలేదు. మొత్తం పొలం విస్తీర్ణానికి రెండు బోరుబావులు మాత్రమే ఉన్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్ల నుంచి సమృద్ధిగా నీరు అందడం లేదు. ఇదే సమయంలో 2 నెలల కిందట సాగు చేసిన బెండ కోతలు ఊపందుకున్నాయి. దీంతో మోదీన్ బెండ పంటకు ట్యాంకర్లతో నీటిని తరలించి తడులు అందిస్తున్నారు, ట్యాంకరుకు రూ.600 ఖర్చు అవుతోందని, దాదాపు 35 ట్యాంకర్ల నీటిని అందించానని తెలిపారు. ఇందుకు కూలీలతో కలిపి మొత్తం రూ.22 వేలు ఖర్చు అవుతోందని తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం నారాయణప్పవలస గ్రామానికి చెందిన మహిళా రైతు అప్పలనరసమ్మ పత్తి మొక్కలకు కుండతో నీరు పోస్తూ వాటిని బతికించేందుకు ఆరాటపడుతున్నారు. ఇదే మండలం పిరిడి-అలజంగి పరిసర ప్రాంతాల్లో ఎడ్లబళ్లపై నీటి డ్రమ్ములు, ట్యాంకర్లను తీసుకువెళ్లి వరి నారుకు నీరు అందిస్తున్నారు.
కొండపై పాయసం పోసి..
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేటలో రైతులు వర్షాల కోసం ఆదివారం గ్రామ దేవత జాకరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపై పాయసం పోసి సామూహికంగా ఆరగించారు. రానున్న 2-3 నెలలు వర్షపాతం మరింత తగ్గుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం
స్వల్పకాలిక, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం విత్తన ప్రణాళికలు అమలు చేస్తోంది. కందులు, పెసలు, కొర్రలు, మినుములు, నువ్వుల పంటల సాగుకు 14,078 క్వింటాళ్ల విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా సిద్ధం చేశారు. మొదటి దశలో జూలై 31 నాటికి అనంతపురం, కర్నూలు, మార్కాపురం ప్రాంతాల్లోని 1.78 లక్షల హెక్టార్లకు 26,950 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. రెండో దశలో ఆగస్టు 15 నాటికి 21 జిల్లాల్లోని 429 మండలాల్లో 4.78లక్షల హెక్టార్లకు అదనంగా 95,838 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఎల్‌నినో ప్రభావం, దాన్ని ఎదుర్కొనే మార్గాలు, నీటి లభ్యత, పంటల రక్షణకు రైతులకు సూచనలు ఇచ్చేందుకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24 ్ఠ్ఠగంటలూ పని చేసేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. పంట రక్షణ మిషన్‌ను ప్రారంభించనున్నారు. ఐసీసీ హెల్ప్‌లైన్ 155251, టీవీ, రేడియో, పత్రికలు, సామాజిక మాధ్యమాలు, సంక్షిప్త సందేశాలు, వాట్సాప్, రైతు సమాచార కేంద్రాల ద్వారా ఎల్‌నినోని ఎదుర్కొనే అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు.








Comments