• Apr 30, 2026
  • NPN Log

    గుంటూరు : పోలీసునని చెప్పి.. ఫార్మసీ విద్యార్థినిని బెదిరించి.. ఆమెపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పోతినేని గోపికి పదేళ్ల జైలు శిక్ష, రూ.23 వేల జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన గోపి దోపిడీలకు పాల్పడుతూ, పోలీసునని చెప్పి ఒంటరి మహిళలతోపాటు ప్రేమ జంటలను బెదిరించి, యువతులపై అత్యాచారం చేసేవాడు. ఈ క్రమంలో గుంటూరు శివారులోని ఫార్మసీ కళాశాలలో చదువుతున్న కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థిని 2024 అక్టోబరు 4న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ యువకుడితో కలిసి స్కూటీపై వెళ్తుండగా, వారిని గోపి బైక్‌పై వెంబడించి అడ్డుకున్నాడు. పోలీసునంటూ వారిని బెదిరించి, పోలీస్ స్టేషన్‌కు రమ్మంటూ.. యువతిని తన బండిపై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి, ఆమెను వదిలి పరారయ్యాడు. అదే రోజు ఆ యువతి కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదయ్యింది. కొత్తపేట సీఐ ఎం.వీరయ్య ఈ కేసు దర్యాప్తు జరిపి నిందితుడు గోపిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. పోలీసు విచారణలో గోపి అత్యాచారం చేసినట్టు తేలింది. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు గోపికి పదేళ్ల జైలు శిక్ష, రూ.23 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించే జరిమానాతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష నగదును నష్టపరిహారం కింద బాధితురాలికి చెల్లించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శితోపాటు కలెక్టర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, యువతిపై అత్యాచారం జరిపిన రోజే నిందితుడు మరో బాలికపై కూడా అత్యాచారయత్నం చేసినట్లు పోలీసు విచారణలో బయటపడింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).