పేర్ల మార్పుతో మోదీ ఉన్మాద చర్యలు వెర్రి తలలు వేసేలా నిర్ణయాలు ఉపాధి పథకం చట్టసవరణతో నిర్వీర్యం గాంధీజీని అవమానించడమే 22 న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజం
అమరావతి: npn, news.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పథకాల మార్పుతో ఉన్మాదం తలపించేలా వెర్రి తలలు వేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. ఇటీవల రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా, తాజాగా ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు మార్చాలని చూడటం దుర్మార్గమన్నారు. ఈ మేరకు మంగళవారం ఈశ్వరయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకానికి రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (రామ్-జీ’) పేరు పెట్టీ..గాంధీజీని అవమానించాలని చూసే కుట్రని తెలిపారు. దేశంలో ఏ సమస్యలూ లేనట్లుగా ఈ తరహాగా పేర్ల మార్పుతో మోదీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలోని ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే..వారు ఈ తరహాగా పేర్లను మార్చడం వల్ల ఖర్చు తప్ప, వచ్చే లాభమేమిటని సూటిగా ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సవరణ బిల్లును చూస్తే..అది కేవలం పేరు మార్చడానికే ఉద్దేశించినదీ కాదన్నారు. పూజ్యబాపు గ్రామీణ రోజ్‌ఘర్ యోజన పేరుతో చేసిన సవరణ చాలా ప్రమాదకరమైందని, ఇది ఉద్దేశపూర్వకంగా మహత్మాగాంధీ పేరు తొలగించడమేనని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులపైన, ఈ దేశ మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపమో? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ చట్ట సవరణతో ఉపాధి హామీ పథకం అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందని, ఇప్పటివరకు గ్రామీణ పేదలు అనుభవిస్తున్న ఉపాధిహామీ చట్టం కల్పించిన హక్కు రద్దవుతుందని పేర్కొన్నారు. 100 రోజుల పనిదినాన్ని 125 రోజుల పనిదినాలుగా పెంచుతూ చేసిన నిర్ణయం హర్షనీయమేనని తెలిపారు. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో కుటుంబానికి 100 రోజులు పనిదినాలు గ్యారెంటీగా కల్పించాల్సి ఉండగా...సగటున 50 పని దినాలనూ కేంద్ర ప్రభుత్వం కల్పించలేకపోయిందన్నారు. దీంతో వేలాది కూలీలు వలసలు వెళ్లిపోయారని తెలిపారు. ఈ చట్టం ప్రకారం పనిలేని రోజుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉండగా..ఎక్కడా అమలు చేయలేదన్నారు. భూస్వాములు, పెత్తందార్ల ఒత్తిళ్ల మోదీ ప్రభుత్వం తలొగ్గి ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు వ్యూహం రచిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు హక్కుగా ఉన్న ఈ చట్టంవల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరకడం గగనంగా మారుతుందన్నారు. వ్యవసాయ కూలీలు, పేద, మధ్యతరగతి రైతులు, పట్టణ శ్రామికులకు అనువుగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని తొలగించడం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుయత్నాలను ప్రతిఘటించడమేనని తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ కూలీలకు కనీస ఉపాధిని గ్యారెంటీ చేయడానికి 2005లో వామపక్షాల ఉద్యమంతో తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టాన్ని ఒక సాధారణ సంక్షేమ పథకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఐక్యంగా ప్రతిఘటించాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ పేర్ల మార్పిడి నిర్ణయాల్ని విరమించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపైన, ప్రజా సమస్యల పరిష్కారంపైన దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.










Comments