• Jul 27, 2026
  • NPN Log

    అధిక బరువు పట్ల ఆయుర్వేదం భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉంటుంది. కొన్ని చికిత్సలతో, నియమాలతో అధిక బరువును తగ్గించుకోగలిగే ఆయుర్వేద మార్గం ఇదే!

    మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో అధిక బరువు సమస్యకు మేదోరోగం అనే పేరుంది. తొడలు, ఉదరం, ఛాతీ మొదలైన శరీర ప్రదేశాల్లో అడిపోజ్‌ కణజాల పరిమాణం పెరిగి, తద్వారా ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడడమే ఊబకాయం అని ఆయుర్వేదం ఊబకాయాన్ని విశ్లేషించింది. అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణాలు. వ్యాయామం లోపించడం, పగటివేళ నిద్ర, కఫాన్ని పెంచే పదార్థాలు అధిక కొవ్వులు, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాలు, నూనె, తీపి, ఉప్పు ఎక్కువగా కలిగి ఉండే ఆహారం తీసుకోవడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలు.

    ఆయుర్వేదం దృష్టిలో...

    ఎక్కువ శాతం వ్యాధులకు మూలం ఆహారంలో ఉన్నట్టే, స్థూలకాయానికీ మూలం ఆహారంలోనే ఉంది. తగని ఆహారం తీసుకోవడం, అస్తవ్యస్త ఆహారపుటలవాట్లను అనుసరించడం, జీవనశైలి క్రమం తప్పడం మూలంగా జీర్ణాగ్నిలో హెచ్చుతగ్గులు ఏర్పడి ఆమం పెరుగుదలకు దారి తీస్తుంది. ఈ ఆమం పెరిగితే శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం తగ్గిపోతుంది. మరో పక్క ఆమం, శరీర కణజాల మార్గాలకు అడ్డుపడడంతో వాతంలో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. వాత దోషం కేంద్ర జీర్ణాగ్నిని ప్రేరేపిస్తూ ఆకలిని పెంచుతుంది. అవసరానికి మించి తినేయడం వల్ల ఊబకాయం పెరుగుతుంది.

    ఊబకాయం చికిత్స

    ఆయుర్వేద చికిత్స కేవలం స్థూలకాయాన్ని తగ్గించడమే ప్రధానంగా కాకుండా, శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని పెంచడమే ఉద్దేశంగా పని చేస్తుంది. ఇందుకోసం ఆమం తగ్గించి, కఫం దోషాన్ని సమం చేయడం ఆయుర్వేద చికిత్సా విధానంలో అనుసరించే ముఖ్య విధానం. శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని పెంచడం కోసం జీర్ణ, కణజాల అగ్నిని బలపరిచి, శరీరంలో ప్రవాహ మార్గాల్లోని అడ్డంకులను తొలగిస్తుంది. ఇందుకోసం అస్తవ్యస్త ఆహారపుటలవాట్లను సరిచేసి, ఒత్తిడి ప్రభావాన్ని శరీరం నుంచి తప్పించే దిశగా ఆయుర్వేద వైద్యం సాగుతుంది.

    ద్రవాహారాలతో: తీపితో కూడిన శీతల పానీయాల స్థానంలో పండ్ల రసాలు, చల్లని పానీయాలకు బదులుగా 35 నుంచి 36 డిగ్రీల వేడితో కూడిన స్వచ్ఛమైన నీళ్లు తాగవలసి ఉంటుంది. భోజనానికి కనీసం 48 నిమిషాల పాటు వేడి నీళ్లను కొద్ది పరిమాణాల్లో తాగుతూ ఉండడం ద్వారా జీర్ణాగ్ని ప్రేరేపితమై ఆకలిని అణచివేస్తుంది. దాంతో వాత దోషం చలనం తేలిక అవుతుంది.

    వేడి నీటి ఉపవాసం: వారానికి ఒక రోజు ఉపవాసం వల్ల పేగులు బాగుపడతాయి. జీర్ణ వ్యవస్థ పునరుత్తేజం అవుతుంది. శరీరం శోషించుకోకుండా మిగిలిన పదార్థాలు జీర్ణాగ్ని సహాయంతో తిరిగి జీర్ణం అవుతాయి. పెసలు, మినుములతో తయారుచేసిన సూప్‌ కూడా వేడి నీటి బదులుగా తాగవచ్చు. ఇందుకోసం ఒక పెద్ద చెంచా పొట్టుతో కూడిన పెసరపప్పును 750 మిల్లీ లీటర్ల నీటిలో ఉడికించి, ఆ నీరును తాగుతూ ఉండాలి.

    తినే విధానం: ఆహారాన్ని తినేటప్పుడు మెదడు పదార్థాల రుచి, వాసన, పదార్థం రకాలను గ్రహించి ఉదరానికి సందేశాలు పంపి, జీర్ణ రసాలు తయారై పదార్థం జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ప్రయాణించే సమయంలో తినడం లేదా టివి చూస్తూ, జీర్ణ ప్రక్రియ బరువు తగ్గే ప్రయత్నాలను కుంటుపరుస్తుంది. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు ఆదరాబాదరాగా కాకుండా ప్రశాంతంగా తగిన సమయాన్ని కేటాయించాలి. తినే పదార్థాల రుచి, వాసన, రకాలను ఆస్వాదించాలి.

    ఆమపచనం: ఆమం ఉన్నప్పుడు బరువు తగ్గడం అసాధ్యం. ఈ కారణం వల్లే ఎక్కువ మంది తీసుకునే ఆహారం తగ్గించినా బరువు తగ్గలేకపోతూ ఉంటారు. కాబట్టి మొదట శరీరంలోని ఆమాన్ని తగ్గించి, తర్వాత బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఆమాన్ని తగ్గించే మూలికలను తీసుకోవచ్చు. అవేంటంటే....

    పసుపు

    త్రికటు (అల్లం, మిరియాలు, పిప్పలి)

    త్రిఫల (అమలాకి, బిభితాకి, హరితాకి)

    గుగ్గులు (శుద్ధి కోసం ఉపయోగకరం)

    నిద్ర అవసరం

    అధిక బరుతు తగ్గించుకోవడం వ్యాయామం ఎంత అవసరమో, సరిపడా నిద్ర కూడా అంతే అవసరం. అస్తవ్యస్థ నిద్ర అలవాట్లు ఆహారపుటలవాట్లనూ అస్తవ్యస్థం చేస్తాయి. దాంతో అవసరానికి మించి ఎక్కువగా తినేస్తూ ఉంటాం. నిద్ర లేమి రక్తపోటు, మధుమేహం, ఛాతీలో మంట మొదలైన మెటబాలిజంతో సంబంఽధం ఉన్న సమస్యలకు కారణం అవుతుంది.

    శారీరక వ్యాయామం

    బరువు తగ్గే ప్రక్రియలో వ్యాయామం కీలకం. శరీరంలో నిల్వ ఉండిపోయిన అదనపు క్యాలరీలను వ్యాయామంతో ఖర్చు చేయవచ్చు. వ్యాయామంతో శరీరంలో ఒత్తిడి తొలగి, కండరాలు శక్తి పొందుతాయి. క్రమం తప్పక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకుంటే తర్వాత పరుగు, ఈత మొదలైన అధిక శ్రమతో కూడిన వ్యాయామాలకు అలవాటు పడే వీలుంటుంది. కాబట్టి బద్ధకాన్ని వదిలి నడకతో వ్యాయామాన్ని ఆరంభించాలి.

    క్రమమైన ఆహారశైలి

    కఫంతో పాటు అధిక కొవ్వు కణజాలం తగ్గడానికి తోడ్పడే వాత వ్యతిరేక ఫలితాన్ని అందించే ఆహారం తీసుకోవాలి. తీసుకునే పదార్థాలన్నీ పొడిగా, తేలికగా జీర్ణమయ్యేవి అయి ఉండాలి. వీటిలో నూనెలు, కొవ్వులు తక్కువ ఉండాలి. శరీర తత్వానికి తగినది, శుద్ధి చేసిన, కొవ్వు కరగానికి తోడ్పడే సుగంధద్రవ్యాలు జోడించిన ఆహారాన్ని తీసుకోవాలి. దాల్చినచెక్క, మిరియాలు, పసుపు, ధనియాలు ఆహారానికి జోడించాలి. జీర్ణక్రియ సక్రమంగానే ఉన్న పిత్త దోష వ్యక్తులు పచ్చి కూరగాయలను తినొచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement