• Sep 20, 2026
  • NPN Log

    వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా సందడి మొదలవుతుంది. భారీ గణేశ్ మండపాలు, అందమైన అలంకరణలు, సామూహిక వేడుకలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక వినాయకుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా భావించే మోదకాలకూ ప్రత్యేక డిమాండ్ ఏర్పడుతుంది. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ స్వీట్ షాప్ తయారు చేసిన ‘గోల్డెన్ మోదక్’ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నాసిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్ ప్రాంతంలో సాగర్ స్వీట్స్ దుకాణం ఉంది. వినాయక చవితి సందర్భంగా ‘గోల్డెన్ మోదక్’ను ఈ షాపు అందుబాటులోకి తెచ్చింది. ఈ మోదక్‌పై తినదగిన బంగారు పూతను పూయడం ప్రత్యేకంగా నిలిచింది. అలాగే కిలోకు ఏకంగా రూ.27,000 ధరను నిర్ణయించడంతో ఈ గోల్డెన్ మోదక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వీటిని సాగర్ స్వీట్స్ తయారు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాదీ ఈ తరహాలోనే గోల్డెన్ మోదక్‌లను తయారు చేసింది. అప్పట్లో వాటి ధర కిలోకు రూ.20,000గా ఉండేది. 2021లోనూ ఈ స్వీట్ షాప్ బంగారు మోదక్‌లను తయారు చేసింది. అప్పట్లో కిలో ధర రూ.12,000గా ఉంది. 2021తో పోలిస్తే ప్రస్తుత ధర రెండింతలకు పైగా పెరగడం చర్చనీయాంశమైంది. మరోవైపు, తినదగిన వెండి పూతతో తయారు చేసిన ‘సిల్వర్ మోదక్’లను కూడా సాగర్ స్వీట్స్ అందుబాటులోకి తెచ్చింది.

    సంప్రదాయ ఉకడిచే మోదక్‌కు భిన్నంగా..

    వినాయక చవితి వేళ మార్కెట్‌లో అనేక రకాల మోదక్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో ప్రసిద్ధమైనవి ఉకడిచే మోదక్‌లు. వీటిని సాధారణంగా బియ్యప్పిండితో తయారు చేస్తారు. బియ్యప్పిండి ముద్దను చిన్న చిన్న వృత్తాకార ముక్కలుగా చేసి, అందులో పూర్ణం పెట్టి అంచులను మూసేస్తారు. కొబ్బరి, బెల్లంతో చేసే పూర్ణానికి యాలకులు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలతో రుచిని అందిస్తారు. ఆ తర్వాత వాటిని ఆవిరిపై ఉడికించడంతో ఉకడిచే మోదక్ సిద్ధమవుతుంది. అయితే, ఈ సంప్రదాయ మోదక్‌కు భిన్నంగా, బంగారు పూతతో తయారు చేసిన గోల్డెన్ మోదక్ ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement