వైసీపీ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజం
విశాఖపట్నం : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై, అసెంబ్లీని బహిష్కరిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే తీరుపై బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ను ఎవరో పక్కత్రోవ పట్టిస్తున్నారని, అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని కలలు కనవద్దని హితవు పలికారు. విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాసనసభకు హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలకు రానున్న 2029 ఎన్నికలలో ప్రజలు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలను వైసీపీ అవమానపరుస్తోందని, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు ప్రజలు వేసిన ఓటు వృధా అవుతోందని విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యానించారు. శాసనసభలో తమకు సమయం ఇవ్వరంటూ జగన్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.
'వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తే మాట్లాడేందుకు మా సమయాన్ని కూడా ఇస్తాము. వారు వెంటనే అసెంబ్లీకి వచ్చి 22ఏ భూ సమస్యలు, మెగా డీఎస్సీ అక్రమాలపై చర్చించాలి' అని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లేలా ఆ పార్టీ శ్రేణులే ధర్నాలు చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీకి ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని సూచించారు.
విశాఖ ఎయిర్పోర్ట్పై సర్కార్ దృష్టి సారించాలి:
మరోవైపు విశాఖపట్నం ఎయిర్పోర్టులో సేవలు నిలిచిపోవడంపై విష్ణుకుమార్ రాజు భావోద్వేగానికి గురయ్యారు. గత 40 ఏళ్లుగా ఈ విమానాశ్రయ సేవలను పొందుతున్నానని, ఒక శకం ముగిసిపోవడం బాధాకరమన్నారు. ఇవాళ చిట్టచివరి విమానంలో తాను విజయవాడ వెళ్తున్నట్లు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కోస్టల్ కారిడార్ రోడ్డు, రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేంతవరకు విశాఖ నుంచే విజయవాడ, హైదరాబాద్, తిరుపతి వంటి ప్రాంతాలకు డొమెస్టిక్ విమాన సర్వీసులు కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.








Comments