• Mar 02, 2026
  • NPN Log

    అలహాబాద్: చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిర్‌మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి కి ఉపశమనం కలిగింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ  కల్పిస్తూ అలహాబాద్ హైకోర్టు శుక్రవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.


    కేసు ఏమిటంటే..

    అవిముక్తేశ్వరానందపై తులసి పీఠాదీశ్వర్ స్వామి రామభద్రాచార్య శిష్యుడు అశుతోష్ బ్రహ్మచారి సెక్షన్ 173(4) కింద జిల్లా కోర్టులో ఫిర్యాదు చేశారు. గురుసేవ పేరుతో గురుకులంలోను, మాఘమేళాలోనూ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు విచారణ జరిపిన పోక్సో ప్రత్యేక కోర్టు ఏడీజే వినోద్ కుమార్ చౌరాసియా దీనిపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని ప్రయాగరాజ్‌లోని ఝాన్సీ పోలీస్ స్టేషన్‌ అధికారులను ఇటీవల ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అవిముక్తేశ్వరానంద, ఆయన శిష్యుడు ముకుందానంద్ గిరి, మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై ఝాన్సీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.

    కాగా, ఈ కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో అవిముక్తేశ్వరానంద వేసిన పిటిషన్‌ శుక్రవారంనాడు విచారణకు వచ్చింది. మీడియా సిబ్బంది కూడా పెద్దఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. అవిముక్తేశ్వరానంద యథాప్రకారం రోజువారీ ప్రార్థనలు, కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆయన శిష్యుడు సంజయ్ సాండే తెలిపారు

    నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమే

    పోక్సో కేసు చట్టం కింద తనమీద నమోదైన లైంగిక వేధిపుల కేసులో సత్యం బయటకు రావడానికి నార్కో అనాలసిస్ పరీక్ష అవసరమనుకుంటే అందుకు సిద్ధమేనని స్వామి అవిముక్తేశ్వరానంద స్వామి శుక్రవారం ఉదయం తెలిపారు. అన్ని సాక్ష్యాలను తమ లాయర్లు కోర్టుకు సమర్పిస్తారని అన్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసులు నిలవనని, ప్రజలే నిజం తెలుసుకుంటారని, సత్యం బయటకు వస్తుందని చెప్పారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు, అంతర్జాతీయ చర్చనీయాంశమవుతున్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్' నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ కేసును తనపై బనాయించినట్టు ఆరోపించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement