ఆ 4.5 కిలోల బంగారం ఎక్కడ
తిరువనంతపురం : శబరిమల ఆలయ నిర్వహణ చేపడుతున్న ట్రావెంకోర్ దేవస్వం బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కూతురి పెళ్లికి దేవాలయం దగ్గర బంగారం అడుక్కొనే వ్యక్తిని దాతగా చూపి, ఆయనకు కిలోల కొద్దీ బంగారం పూత ఉన్న భారీ విగ్రహాల తొడుగుల పునరుద్ధరణ బాధ్యత అప్పగించింది. పునరుద్ధరణకు ఆయన సొంతంగా వెచ్చించిన బంగారం 400 గ్రాములు కాగా.. దేవస్థానం 42.8 కిలోల బరువున్న బంగారం పూతతో కూడిన రాగి తొడుగులను ఆయనకు ఇచ్చింది. చివరకు మెరుగులు దిద్దించి, అప్పగించిన రాగి-బంగారు తొడుగుల బరువు కేవలం 38.25 కిలోలు. అంటే నాలున్నర కిలో లు తేడా వచ్చింది. తగ్గిందంతా బంగారమేనని అనుమానిస్తున్నారు. శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాల పాదపీఠానికి, తొడుగులకు వేసిన బంగారు తాపడం మెరుగు తగ్గడంతో దానికి తన సొంత ఖర్చుతో కొత్తగా తాపడం వేయించేందుకు బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి ముందుకొచ్చాడు. ఆయన గతంలో దేవస్థానంలో ఉద్యోగం చేసినవాడే కావడం గమనార్హం. మొదట 2019 జూలైలో పాదపీఠాలు, తొడుగులను మెరుగుదిద్దే బాధ్యతను ఆయనకు అప్పగించారు. జూలై 19న పొట్టి సమక్షంలోనే వాటిని తొలగించారు. తూకం వేయగా 42.8 కిలోలని తేలింది. మర్నాడు శబరిమల నుంచి పాదపీఠాలు, విగ్రహ తొడుగులతో కూడిన కంటైనర్ బయల్దేరింది. చెన్నైలో బంగారుతాపడం చేసే సంస్థ స్మార్ట్ క్రియేషన్ వర్క్‌షా్‌పకు చేరగానే అక్కడి ఉద్యోగులు తూకం వేయగా.. 38.25కిలోలు ఉన్నట్లు తేలింది. కంటైనర్‌లో ఎక్కించినపుడు 42.8 కిలోలున్న బంగారం తాపడం ఉన్న రాగి తొడుగులు కిందికి దింపగానే నాలుగున్నర కిలోలు ఎలా తగ్గాయన్నదే ప్రశ్న. దీనికితోడు కంటైనర్ శబరిమల నుంచి చెన్నైలోని వర్క్‌షా్‌పకు చేరడానికి 39 రోజులు పట్టింది! జూలై 20న బయల్దేరితే ఆగస్టు 29కి చేరింది. ఆ 39 రోజుల్లో ఏం జరిగిందనే దానిమీద తాము పరిశోధించామని, సంచలనాత్మక విషయాలు తెలిశాయని ఎన్డీటీవీ ప్రకటించింది.
కంటైనర్ కొట్టాయంలోని ఒక ప్రైవేటు దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు, బెంగళూరులోని శ్రీరాంపురంలో అయ్యప్ప ఆలయానికి వెళ్లినట్లు తెలిపింది. చెన్నైలో ఉంటున్న ప్రముఖ మలయాళ నటుడు జయరాం ఇంట్లో జరిగిన ప్రైవేటు పూజకు కూడా వీటిని తీసుకెళ్లినట్లు ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి ఒక ఫేస్‌బుక్ పోస్టును ఆధారంగా చూపిస్తోంది. 2019 ఆగస్టు 29న చెన్నై వర్క్‌షా్‌పకు వచ్చిన విగ్రహాల తొడుగులకు మెరుగులు దిద్ది, సెప్టెంబరు 11న తిరిగి దేవస్థానానికి పంపారు. వర్క్‌షా్‌పకి వచ్చినప్పుడు వాటి బరువు 38.25 కిలోలు ఉంటే ఉన్నికృష్ణన్ పొట్టి తన సొంత బంగారం 394 గ్రాములు కలిపి మెరుగులు దిద్దించాడు. సొంత బంగారం కలిపినప్పటికీ వర్క్‌షా్‌పకు ఎంత బరువుతో వచ్చిందో అంతే బరువుతో తిరిగి పంపించడం గమనార్హం. మరోవైపు తగ్గిన నాలుగున్నర కిలోల బరువు గురించి అడిగిన వారూ లేరు, చెప్పిన వారూ లేరు. అదనంగా చేర్చిన 394 గ్రాములు ఏమయ్యాయని అడిగిన వారు కూడా లేరు.
చివరకు 2019 డిసెంబరులో పొట్టి తన దగ్గర కొంత దేవస్థానం బంగారం మిగిలిందని, అనుమతిస్తే కుమార్తె పెళ్లికి వాడుకుంటానని స్వయంగా దేవస్థానానికి ఈ-మెయిల్ పెట్టారు. దీంతో దేవస్థానం బంగారం దాత చేతిలో ఉందన్న విషయం మీడియా దృష్టికి వచ్చింది. వరస కథనాలు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2020లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. 2021లో దీనిపై దర్యాప్తునకు హైకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో ద్వారపాలకుల విగ్రహాల తొడుగుల విషయంలో నాలుగున్నర కిలోల బంగారం తేడా ఉందన్న విషయం బయటకు వచ్చింది. నిజానికి 2018లో కూడా ఇతనికి ప్రధాన ద్వారం బంగారం తాపడం మెరుగులు పెట్టే బాధ్యతను అప్పగించారు. ఆయన ఏకంగా ప్రధాన ద్వారాన్ని చెన్నైకి తీసుకెళ్లి బంగారు తాపడం పెట్టించుకువచ్చారు. ఆ సమయంలో దేవస్థానమే ఆయనకు 474.9 గ్రాముల బంగారాన్ని ఇచ్చింది. కొత్తగా తాపడం చేసిన ఆలయ ద్వారాలను ఉన్నికృష్ణన్ పొట్టి 2019 మార్చిలో కేరళకు తీసుకొచ్చి, ఒక పెద్ద కార్యక్రమంలో ఆలయ పెద్దలకు అప్పగించాడు.
మాల్యా ఇచ్చింది 30 కిలోలు
1998లో వ్యాపారవేత్త విజయ్ మాల్యా 30 కిలోల బంగారాన్ని శబరిమల ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మరో 800 గ్రాములు తలుపుల తాపడం కోసం ఇచ్చారు. ఉన్నికృష్ణన్ వ్యవహారాలపై విచారిస్తున్నప్పుడు మాల్యా ఇచ్చిన బంగారంలో ఎంత ఆలయానికి వెచ్చించారు? ఎంత మిగిలింది? అనేది లెక్కలు లేవని కేరళ హైకోర్టు గుర్తించింది. ఆ లెక్కలన్నీ తీయాలని సిట్‌ను ఆదేశించింది. సిట్ రిపోర్టులో మిగిలిన బంగారం వాడుకుంటానని ఉన్నికృష్ణన్ పొట్టి రాసిన లేఖ ప్రస్తావనకు వచ్చినప్పుడు హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము నిబంధనల ప్రకారమే చేశామని ట్రావెంకోర్ బోర్డు స్పష్టం చేసింది. హైకోర్టు అంతటితో వదల్లేదు. ఇప్పుడు ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన పాదపీఠం, తొడుగులు అసలువా, నకిలీవా? అనేది తేల్చాలని ఆదేశించింది.
Comments