క్యాప్స్ గోల్డ్ కేసులో.. కైసా జువెలర్స్ సీజ్
హైదరాబాద్ :క్యాప్స్ గోల్డ్‌పై ఐటీ శాఖ కొనసాగిస్తున్న దాడుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్యాప్స్ గోల్డ్‌తో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన సికింద్రాబాద్‌లోని కైసా జువెలర్స్‌ను ఐటీ అధికారులు సీజ్ చేశారు. పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు సంబంధించి ఐటీ సోదాలు వరుసగా నాలుగో రోజు హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగాయి. క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.50 లక్షల నగదు, పెద్ద మొత్తంలో బంగారం బిస్కెట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐటీ ప్రత్యేక బృందాలు గత బుధవారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఐటీ చెల్లింపులతోపాటు బంగారం అమ్మకాలు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను గుర్తించినట్లు తెలిసింది. బిల్లులు లేకుండా పెద్ద మొత్తంలో బంగారం అమ్మకాలు జరిగినట్లు ఐటీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఐటీ చెల్లింపుల్లో భారీగా వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు... పన్నుల చెల్లింపులు, బంగారం క్రయవిక్రయాలు, బంగారం స్టాక్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, ఆబిడ్స్ కేంద్రంగా ఉన్న క్యాప్స్‌గోల్డ్, కలశ ఫైన్ జువెల్స్ కార్యాలయాలు, వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ చందా శ్రీనివాస్ రావు సహా క్యాప్స్‌గోల్డ్, కలశ ఫైన్ జువెల్స్ డైరెక్టర్లు చందా అభిషేక్, చందా సుధీర్, సౌమ్యాల నివాసాల్లో గత నాలుగు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి.
Comments