కొద్దిసేపు కూర్చోలేరా, మరి ఎందుకొచ్చారు.. సహనం కోల్పోయిన సిద్ధరామయ్య
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి సహనం కోల్పోయారు. వేదికపై నుంచే కొందరు ఆడియెన్స్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు కూర్చోలేరా.. కూర్చోండి..ఆ మాత్రం దానికి ఇంట్లోనే ఉండక ఎందుకు వచ్చినట్టు? అంటూ మండిపడ్డారు. 'వాళ్లను వెళ్లనీయకండి' అని పోలీసులను సైతం ఆదేశించారు. మైసూరు దసరా వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై నుంచి ప్రసంగిస్తున్న సందర్భంలో కొందరు ఆడియెన్స్ వెళ్లిపోయేందుకు సిద్ధపడినప్పుడు సీఎం ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
'కొద్దిసేపు కూర్చోలేరా? కూర్చోండి? ఏమిటది? ఒకసారి చెబితే మీకు అర్ధం కాదా? అలాంటప్పుడు ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఇంట్లోనే ఉండిపోవాల్సింది' అని వేదికపై నుంచి సీఎం కన్నడంలో అనడం కనిపించింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలో ఆడియెన్స్ ఎవరనేది కనిపించలేదు. 'పోలీస్.. వాళ్లను వెళ్లనీయకండి ఒక అరగంటో, గంటో కూర్చోలేరా? అలాంటప్పుడు రావడం ఎందుకు?' అని సీఎం అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభానికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. ఆమె గతంలో హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అభ్యంతరం పెట్టింది. వేదమంత్రాలతో చాముండేశ్వరి ఆరాధన జరుగుతుందని, మతపరమైన సంప్రదాయాలకు అనుగుణంగా జరిగే దసరా వేడుకలను ఆమె చేత ప్రారంభించడం సరికాదని మరికొందరు వాదించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది.
ఈ పండుగ అందరిదీ
కాగా, బాను ముస్తాక్‌ను ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని సిద్ధరామయ్య దసరా వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా సమర్ధించారు. పుట్టుకతో ఆమె ముస్లిం అయినా దానికంటే ముందు ఆమె మనిషి అని, మనుషులంతా ఒక్కటేనని, పరస్పరం ప్రేమ, గౌరవం పంచుకోవాలని, కులం, మతం పేరుతో ఎవరినీ ద్వేషించరాదని అన్నారు. దసరా పండుగ ఏ కులానికో, మతానికో చెందినది కాదని, దసరా పండుగ అందరి పండుగ అని పేర్కొన్నారు.
Comments