కరూర్ తొక్కిసలాట ఒక కుట్ర: ఖుష్బూ
తమిళనాడు కరూర్ పట్టణంలో నిర్వహించిన విజయ్ పార్టీ ర్యాలీలో నెలకొన్న తొక్కిసలాటపై ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాటపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఖుష్బూ.. దీని వెనుక కుట్రకోణం కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని కూడా ఆమె ఆరోపించింది. ఈ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. రాజకీయ వేత్తగా మారిన ప్రముఖ తమిళ నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ ర్యాలీ సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఘటన సమయంలో పోలీసుల నిర్వహణలో లోపాలు, అనుమతుల ఆలస్యం, సమర్థవంతమైన ఏర్పాట్లు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంకేతాలని ఖుష్బూ ఆరోపించారు. అటు, విజయ్ కూడా ఈ ఘటనను రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తూ, CBI దర్యాప్తు కోరారు. మద్రాస్ హైకోర్టు ఈ ఘటనపై SIT దర్యాప్తును ఆదేశించింది. TVK నాయకుల నిర్లక్ష్యాన్ని కోర్టు ఖండించింది. మరోవైపు, ఈ ఘటన రాజకీయ ఆరోపణలు, బ్లేమ్ గేమ్లకు నెలవుగా మారిపోయింది. ప్రభుత్వం వీడియోలు విడుదల చేసి టీవీకే పార్టీ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో భవిష్యత్ పబ్లిక్ ఈవెంట్లకు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తామని కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
Comments