50 అయినా 70 ఏళ్లు వచ్చినా పార్కులకు వెళ్లాల్సిందే..
యాభై ఏళ్లు వచ్చాయంటే చాలు... కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటూ బయటికి వెళ్లడం తగ్గించేస్తారు మనవాళ్లు. అదే చైనాలో 50 అయినా 70 ఏళ్లు అయినా పార్కులకు వెళ్తున్నారు. నడక, స్వచ్ఛమైన గాలి కోసం కాదండోయ్... కత్తిసాము, చెర్నకోల విన్యాసాలు, ‘తాయి చీ’లు నేర్చుకుంటూ ఫిట్‌గా ఉండేందుకు...
ఇటీవల కాలంలో చైనా పార్కుల్లో మునుపెన్నడూ లేనంతగా సీనియర్ సిటిజన్స్ కనిపిస్తున్నారు. సాధారణంగా ఆ వయసు వాళ్లు వాకింగ్, మెడిటేషన్ చేస్తారు. కానీ అక్కడ మాత్రం కత్తిసాము సాధన చేస్తుంటారు. కొంతమంది చెర్నకోలను అటూఇటూ తిప్పుతుంటారు. ఇంకొందరు చెట్లకు వేలాడుతుంటారు. ఈ వయసులో వారికి ఎందుకంత కష్టం అనిపిస్తుంది. కానీ అక్కడి వైద్యుల సూచనల మేరకు చైనాలో వృద్ధులు ఈ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
వయసు పెరిగే కొద్దీ శరీరాకృతి మారుతుంది. కండరాలు సడలి, మునుపటి ఫిట్నెస్ ఉండదు. అయితే ముసలితనాన్ని కూడా సరిగా మేనేజ్ చేసుకోవాలని చైనాలో వృద్ధులు సాహస కృత్యాలకు తక్కువ కాని పనులను చేస్తున్నారు. కేవలం ఏరోబిక్, స్ర్టెచింగ్ ఎక్సర్‌సైజులతో వాళ్లు ఆగట్లేదు. బీజింగ్, షాంఘైలాంటి నగరాల పార్కుల్లో చాలామంది వృద్ధులు నృత్యాలు చేస్తుంటారు. కత్తులూ, విసనకర్రలతో చైనీస్ ‘తాయి చీ’ క్లాసులకు అటెండ్ అవుతారు. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవటమేగాక, కండరాల్లో బలం చేకూరుతుందట. ఎముకలూ బలోపేతం అవుతాయి.
‘సిల్వర్ హెయిర్ ట్రెయిన్ జర్నీ’
చైనాలో క్రమక్రమంగా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి ప్రభుత్వం ఉద్యోగ పదవీ విరమణ వయసును పురుషులకు 60 నుంచి 63కు, స్త్రీలకు 55 నుంచి 58కి పెంచింది. ఆర్థికరంగ ప్రగతిలో వృద్ధులనూ భాగస్వాములను చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులు ఎక్కువగా ప్రయాణం చేసేలా ప్రోత్సహిస్తూ ‘సిల్వర్ హెయిర్ ట్రెయిన్ జర్నీ’లను ప్రవేశపెట్టారు. ఈ రైళ్లలో ఉచిత ఆహారమేగాకుండా... వైద్య కేంద్రాలు కూడా ఉంటాయి. 2035 నాటికి ఈ ‘సిల్వర్ ఎకానమీ’ ద్వారా 9 శాతం వృద్ధిని సాధించాలని చైనా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం అది 6 శాతంగా ఉంది.
ఇటీవల రిటైర్ అయినవాళ్లు క్రీడా సామగ్రిని ఎక్కువగా కొనుగోలుచేస్తున్నారట. అలాగే ఫిట్నెస్ ప్రోగ్రాములలో చేరుతున్నారట. పార్కుల్లో చెట్ల కింద ‘నెక్ హ్యాంగింగ్’లు లాంటి సాహసభరిత ఎక్సర్సైజులను చేసేందుకు వృద్ధులు వెనుకాడటం లేదు. చైనీస్ టెక్నో సంగీతం హోరులో నృత్యాలు చేసే వృద్ధ మహిళా బృందాలు సాయంత్రం వేళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. 80 ఏళ్ల మహిళలూ ఈ ఫిట్నెస్ నృత్యాల్లో పాల్గొనడం విశేషం. మొత్తానికి చైనాలో వృద్ధులు వయసును కట్టడి చేయడానికి చేస్తున్న విన్యాసాలు సరికొత్తగా ఉన్నాయి కదూ.
Comments