టాటా సన్స్ లిస్టింగ్ జరగాల్సిందే
న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్స్ బోర్డు మీటింగ్ వాడి వేడిగా జరిగినట్లు సమాచారం. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో టాటా గ్రూప్ కంపెనీల మాతృ సంస్థ టాటా సన్స్ షేర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాల్సిందేనని షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ పట్టుబట్టింది. దీనికి సంబంధించి ఎస్పీ గ్రూప్ చైర్మన్ షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ ఒక ప్రకటన విడుదల చేశారు. షేర్లను లిస్ట్ చేస్తేనే టాటా సన్స్ ఈక్విటీలో 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్ ట్రస్టీల ఇంటి పోరుకు తెరపడి, కంపెనీ నిర్వహణలో పూర్తి పారదర్శకత ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. టాటా సన్స్ ఈక్విటీలో ఎస్పీ గ్రూప్ 18.37 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీ మిస్త్రీ చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్బీఐ ఆదేశించినా గత నెలాఖరులోగా టాటా సన్స్ కంపెనీ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయించలేక పోవడంపైనా మిస్త్రీ ఈ సమావేశంలో ట్రస్టీలను నిలదీసినట్టు సమాచారం. ఇప్పటికైనా వీలైనంత త్వరగా టాటా సన్స్ లిస్టింగ్ పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ చర్య టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో వాటాలు ఉన్న 1.2 కోట్ల మంది వాటాదారులకూ మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. టాటా ట్రస్ట్స్ ట్రస్టీల ఇంటిపోరుతో చైర్మన్ నోయెల్ టాటా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కూడా ఇటీవల జరిగిన భేటీలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్లను నిలదీసినట్టు సమాచారం. ఈ ఇంటిపోరు ముదిరితే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న టాటా గ్రూప్ కంపెనీల పనితీరుపైనా ప్రభావం పడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
Comments