డార్జిలింగ్‌లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు
డార్జిలింగ్: పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ హిల్స్‌లో భారీ వర్షాలు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. ఆదివారంనాడు పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి 17 మంది వరకూ మృతి చెందగా, పలువురి జాడ గల్లంతైంది. అనేక ఇళ్లు కొట్టుకుపోగా, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మారుమూల ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెగని వర్షాలతో మిరిక్, కుర్సియోంగ్‌లోని పలు టూరిస్ట్ హాట్‌స్పాట్‌లు, పట్టణాలను కలిపే ఇనుప వంతెన కూలిపోయింది.
సర్సాలి, జస్బీర్‌గావ్, మిరిక్ బస్తి, ధర్ గావ్, మిరిక్ లేక్ ప్రాంతంల్లో పలువురు మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. మట్టి రాళ్లు, బురదలో పలు ఇళ్లు కూరుకుపోగా, ధర్‌గావ్‌లో నలుగురిని సహాయక బృందాలు కాపాడాయి. కుండపోత వర్షాల ప్రభావం డార్జిలింగ్, కలింపాంగ్ ప్రాంతాలపై ఎక్కువగా ఉంది. ఇలామ్ జిల్లాలో ఐదుగురు, పటేగాన్, మున్సేబుంగ్, డ్యూమా, ధుసుని, రత్మాట్, ఘోసాంగ్ ప్రాంతాల్లో మరో తొమ్మిది మది మరణించినట్టు అధికారులు తెలిపారు. మిరిక్ లేక్ ఏరియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
పలు ప్రాంతాలకు ఎమర్జెన్సీ వాహనాలు చేరేందుకు అంతరాయం కలుగుతుండటంతో హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్టు అధికారులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయిన టూరిస్టులకు సాయపడేందుకు డార్జిలింగ్ పోలీసులు హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేశారు. +91 91478 89078 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
డార్జిలింగ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడి పలువురు మృతి చెందడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావాలని, క్షతగాత్రులు త్వరితగతిని కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నామని, బాధితులకు తాము అండగా నిలుస్తామని ప్రధాని తెలిపారు.
Comments