తెలంగాణ మీదుగా 3 హైస్పీడ్ రైలు మార్గాలు
హైదరాబాద్ : తెలంగాణ మీదుగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-అమరావతి హైస్పీడ్ రైలు మార్గాలను నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాలకు అలైన్‌మెంట్లు ఇప్పటికే ఖరారవగా.. హైదరాబాద్-అమరావతి మార్గంపై కసరత్తు సాగుతోంది. వీటిపై సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించనున్నారు. ఈ సమీక్ష కోసం రైల్వే ముఖ్య ఇంజనీర్లు కూడా వచ్చినట్టు తెలిసింది. హైస్పీడ్ మార్గాలతోపాటు వికారాబాద్-కృష్ణా, డోర్నకల్-గద్వాల, కల్వకుర్తి-మాచర్ల, రీజనల్ రింగు రైలు మార్గాలపైనా సీఎం సమావేశంలో సమీక్షించనున్నట్టు సమాచారం.
హైస్పీడ్ రైలు మార్గాలు ఇలా..
హైస్పీడ్ రైలు మార్గాల్లో హైదరాబాద్-చెన్నై రూట్‌కు సంబంధించి మూడు అలైన్‌మెంట్లు సిద్ధం చేయగా.. తెలంగాణ పరిధిలో 6-7 స్టేషన్లు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ మార్గం కాజీపేట మీదుగా కాకుండా నార్కట్‌పల్లి- సూర్యాపేట- కోదాడ మీదుగా ఉంటుందని సమాచారం. ఇక హైదరాబాద్- బెంగళూరు రైలు మార్గాన్ని నాగపూర్-హైదరాబాద్-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డుకు సమాంతరంగా నిర్మించనున్నారు. దీనికి కూడా 3 రకాల అలైన్‌మెంట్లను రూపొందించగా.. తెలంగాణ పరిధిలో 4-5 స్టేషన్లు ఉండవచ్చని అంచనా. దీనికితోడు ప్రతిపాదిత హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డుకు సమాంతరంగా హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వీటన్నింటిపైనా సీఎం సమీక్షించనున్నారు.
రింగు రోడ్డు పక్కనే.. రింగు రైలు..
రీజనల్ రింగు రోడ్డు వెంట రైలు మార్గం నిర్మించాలని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రీజనల్ రింగ్ రైలుగా పిలుస్తున్న ఈ మార్గాన్ని ‘రీజనల్’ రోడ్డుకు పక్కన సుమారు 3-4 కిలోమీటర్ల నుంచి 13-14 కి.మీ దూరంలో సాగేలా తొలుత ప్రతిపాదించారు. కానీ ప్రయాణ మార్గాల అనుసంధానం దగ్గరగా ఉండేందుకు.. రీజనల్ రోడ్డుకు పక్కనే రైలు మార్గం నిర్మించాలని నిర్ణయించి, ప్రాథమికంగా అలైన్‌మెంట్ రూపొందించారు. దీనిపై బుధవారం కేంద్ర, రాష్ట్ర అధికారులు మరోసారి సమావేశం నిర్వహించారు. రీజనల్ రోడ్డు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించేందుకు.. రోడ్డు పొడవునా 45 మీటర్ల వెడల్పుతో భూమి కావాలని రైల్వే అధికారులు కోరినట్టు తెలిసింది.
Comments