తలలకు వెలలే చంపేస్తున్నాయా?
హైదరాబాద్ : ప్రజా పోరాటాల ద్వారా పాలకవర్గాల్లో వణుకు పుట్టించి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒక్కొరొక్కరు వరుసగా ఎన్‌కౌంటర్లలో హతమవుతున్నారు. అగ్రనాయకత్వానికి సంబంధించిన ఈ ఎన్‌కౌంటర్లను గమనిస్తే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు ప్రజా సంఘాల నాయకులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. చనిపోయిన ఒక్కొక్క కేంద్ర కమిటీ సభ్యుని తలపై రూ.కోటికి పైగా రివార్డును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అదే ప్రస్తుతం వారి పాలిట శాపమైందని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని మాజీ మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు నర్సింహచలం అలియాస్ సుధాకర్, గాజర్ల రవి, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, మోడెం బాలకృష్ణ, రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుదాదా, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, సోరెన్ ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించారు. నంబాల కేశవరావు, గాజర్ల రవి ఎన్‌కౌంటర్ సమయంలో మాత్రమే సహచర మావోయిస్టులు ఎక్కువగా చనిపోయారు. మిగతా వారిలో చాలా సంఘటనల్లో నాయకత్వమే ప్రాణాలు కోల్పోయింది. దీనికి కారణాలేమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, మావోయిస్టు నాయకత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని స్థానికులు, లొంగిపోవాలనుకుంటున్న నక్సల్స్ నుంచి సేకరిస్తున్నారన్న విషయం పోలీసు అధికారుల సంభాషణల ద్వారా స్పష్టమవుతోంది. డబ్బెవరికి చేదండి.. కోట్ల రూపాయల రివార్డులు ఉన్నపుడు సమాచారం అదే వస్తుందని పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారంటే క్షేత్రస్థాయిలో మావోయిస్టు నాయకత్వాన్ని గుండెల్లో దాచుకునే రోజులు పోయినట్లేనని స్పష్టం అవుతోంది.
సొంత నాయకుల సమాచారం లీక్!
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మొదట్లో 42 మంది సభ్యులుండేవారు. ముఖ్య నాయకులతో పొలిట్ బ్యూరో ఉండేది. జనతన సర్కార్‌తో సొంత సామ్రాజ్యాన్ని నిర్మించిన మావోయిస్టులు పదేళ్లుగా ఒకరి తర్వాత మరొకరు ఎన్‌కౌంటర్లలో మరణిస్తూనే ఉన్నారు. కొత్త రిక్రూట్‌మెంట్ లేక, ఉన్న వారిలో చాలామంది ప్రాణాలపై, డబ్బుపై ఆశతో సొంత నాయకుల సమాచారాన్నే లీక్ చేస్తున్నారన్న విషయాన్ని ఇటీవల కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీ విడుదల చేసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ఒకవైపు పనిచేస్తుండగా.. పార్టీలో ఉన్న వారు ఆయుధాలు వదిలి లొంగిపోవాలంటూ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ లేఖ రాయడం, దానిపై ఆగస్టు 15వ తేదీ ఉండటం, సెప్టెంబరులో ఆ లేఖ బయటకు రావడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ నుంచి మరికొన్ని లేఖలు బయటకు వచ్చిన క్రమంలోనే ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఒకేచోట పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించడం అనుమానాస్పద వ్యవహారమేనని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ఇవన్నీ గమనిస్తుంటే ద్రోహులు బయట లేరు.. పార్టీలోనే ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయని మాజీ మావోయిస్టులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారు లొంగిపోవాలనుకుంటే కేంద్ర, రాష్ట్ర కమిటీల అనుమతి తీసుకుని తమ ఆయుధాన్ని పార్టీకి అప్పగించి బయటకు వచ్చే స్వేచ్ఛాయుత వాతావరణం ఉందని, అందుకు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత లొంగుబాటు ఒక ఉదాహరణ అని వారు పేర్కొంటున్నారు. మే నెలలో లొంగుబాటు విషయాన్ని ప్రసాదరావు ద్వారా సుజాత కేంద్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లిందని, అదే నెలలో ప్రసాదరావు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని అంటున్నారు. అంటే నక్సల్స్ సమాచార చానల్ గుర్తించి నాయకత్వాన్ని టార్గెట్ చేయడం పోలీసులకు అలవాటుగా మారిందని మాజీ మావోయిస్టులు అనుమానిస్తున్నారు.
త్వరలో లొంగిపోనున్న మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు!
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన అగ్రనాయకుల్లో చాలా మంది 60 ఏళ్లు వయస్సు వారే. ఈ ఏడాది జనవరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 20మంది సభ్యులున్నారు. వీరిలో 15మంది సభ్యులు తెలుగువారే. పోతుల సుజాత లొంగుబాటు, ఇతర కేంద్ర కమిటీ సభ్యుల ఎన్‌కౌంటర్ల తర్వాత ఇంకా పార్టీలో మిగిలిన తెలుగువారు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు, పసునూరి నరహరి, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, పాక హన్మంతు మాత్రమే. వీరిలో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు కూడా త్వరలో లొంగిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయని నిఘావర్గాల ద్వారా తెలుస్తోంది.
Comments