తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానం
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కలను టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అభినందించారు. ఈ మేరకు వారికి బుధవారం వేర్వేరుగా లేఖలు రాశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.3.87 లక్షలుగా నమోదు కావడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆర్థిక క్రమశిక్షణ, సమ్మిళిత ఆర్థిక విధానాలతో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా తదితర రంగాల్లో సమతుల్యతను పాటిస్తూ రైతుల రుణమాఫీ, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడంతో జాతీయ స్థాయిలో రాష్ట్రం గుర్తింపు పొందడానికి అవకాశం ఏర్పడిందన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలువడం రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమని తెలిపారు.
Comments