దుర్గమ్మ @ 15 లక్షల మంది
విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల ప్రారంభం రోజు నుంచి విజయదశమి వరకు రికార్డు స్థాయిలో భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి 15 శాతం ఎక్కువగా భక్తులు వచ్చారు. ఇంద్రకీలాద్రిపై సెప్టెంబరు 22 నుంచి ఈ నెల 2 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. గతేడాది దాదాపు 13 లక్షల మంది భక్తులు రాగా.. ఈ ఏడాది శుక్రవారం సాయంత్రం వరకు 15,03,487 మంది అమ్మవారిని దర్శించున్నారు. ఇంకా ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో భవానీ మాల ధరించిన భక్తులు ఇంద్రకీలాద్రికి భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం భక్తుల రాక సంఖ్య అధికారులు వేసుకున్న అంచనాలకు తగ్గట్టుగానే 20 లక్షలకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా.. శుక్రవారం ఈ అలంకారంలోనే ఉన్నారు.
Comments