దుర్గం చెరువులో.. చేపలు చనిపోతున్నాయ్..
హైదరాబాద్ సిటీ: దుర్గం చెరువు లో చేపలు మళ్లీ చనిపోతున్నాయి. వారం రోజులుగా దుర్గం చెరువులోని నీళ్లపై చనిపోయిన చేపలు తేలియాడుతున్నాయి. అవి ఒడ్డుకు చేరడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెరువులోకి కలుషిత జలాలు, సీవరేజ్ వ్యర్థాలు చేరకుండా వాటర్‌బోర్డు అధికారులు కట్టడి చేశారు. ఎస్టీపీల నిర్మించి శుద్ధి చేసిన జలాలే దుర్గం చెరువులో చేరేవిధంగా చర్యలు చేపట్టారు. అయినా ఏడాదిన్నర నెలల క్రితం దుర్గం చెరువులో చేపలు చనిపోవడంతో మురుగు వ్యర్థాలు చేరకుండా కట్టడి చేశారు.
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు వివిధ ప్రాంతాల నుంచి దుర్గం చెరువులోకి పెద్దఎత్తున వరద చేరింది. సాధారణంగా కొత్త నీరు చేరితే దుర్గంచెరువులో ఆక్సిజన్(Oxygen) స్థాయిలు మరింత పెరుగుతాయి. చెరువుల్లోకి కొత్త నీరు రావడం చేపల వృద్ధికి దోహదపడాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా చెరువుల్లోని చేపలు చనిపోతున్నాయి.
కలుషిత జలాలే కారణమా.?
మురుగు ప్రవహం అధికంగా వచ్చినా దుర్గంచెరువులో చేరకుండా 2016లో చెరువు చుట్టూ ట్రంక్‌లైన్ నిర్మించారు. చెరువు చుట్టుపక్కల భారీగా నిర్మించిన అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆస్పత్రుల నుంచి విపరీతమైన మురుగు వస్తుండగా అది చెరువులో చేరకుండా పూర్తిగా మళ్లించారు. అప్పటికి ఉన్న ఎస్టీపీ సామర్థ్యం సరిపోకపోవడంతో మరో ఎస్టీపీని సైతం నిర్మించి ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో దుర్గంచెరువులోని నీరంతా మెరుగుపడడంతో చేపలు వదిలి పెంచుతున్నారు.
అయితే ఏడాదిన్నర క్రితం నుంచి దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై హైకోర్టు కమిటీ వేసిన నేపథ్యంలో గతంలోనే వివిధ శాఖల అధికారులు జలాలు కలుషితమవ్వడంపై ఆరా తీశారు. కారణాలను కోర్టుకు నివేదించారు. ఇటీవల మళ్లీ చేపలు చనిపోతున్నాయి. వర్షాలకు వివిధ ప్రాంతాల నుంచి మురుగు వ్యర్థాలన్నీ ఓవర్‌ఫ్లోతో దుర్గంచెరువులో చేరడమే ఇందుకు కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments