దూసుకెళ్లిన డీసీఎం.. తల్లీకుమార్తె మృతి
బెజ్జంకి : దసరా పండుగ కోసం పుట్టింటికి వచ్చి.. తిరిగి వెళ్తుండగా డీసీఎం రూపంలో తల్లీకుమార్తెలను మృత్యువు కబళించింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి శివారు రాజీవ్‌రహదారిపై శనివారం ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన శ్రీరామోజు సుమన్, వీణారాణి (39) దంపతులకు యశస్విని, మనస్విని(6) కుమార్తెలు. దసరా సందర్భంగా వీణారాణి తన తల్లిగారి ఊరైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లికి భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి వచ్చింది. శనివారం వింజపల్లి నుంచి బొమ్మకల్‌కు తిరిగి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మండలంలోని దేవక్కపల్లి స్టేజీ సమీపంలో రాజీవ్‌రహదారి పక్కన సీతాఫలాలు కొనుగోలు చేసేందుకు ఆగారు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఓ డీసీఎం వ్యాను ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కన ఉన్న వీణారాణి కుటుంబం పైకి దూసుకెళ్లింది. దీనితో వీణారాణి, మనస్విని అక్కడికక్కడే మృతి చెందగా, సుమన్, యశస్వినికి తీవ్ర గాయాలయ్యాయి.
Comments