నగరమంతా క్యూమిలో నింబస్ మేఘాలు.. హైదరాబాద్‌లో జోరు వాన
హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్ నగరవ్యాప్తంగా క్యూమిలో నింబస్ మేఘాలు అలుముకున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా.. ఆ తర్వాత అవి జోరువానగా మారాయి. రానున్న రెండు మూడు గంటలపాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈరోజు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు అక్కడక్కడా జోరు వాన కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలతోపాటు జీహెచ్ఎంసీ, హైడ్రా, DRF, ట్రాఫిక్ సిబ్బందిని IMD అప్రమత్తం చేసింది.
కాగా, ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీగా వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, గచ్చీబౌలి, హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడలో జోరువాన కురుస్తోంది. SR నగర్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్‌గూడ, సనత్‌నగర్, మూసాపేట్‌లోనూ వర్షం దంచికొడుతోంది. కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ, మియాపూర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
Comments