నేపాల్లో భారీ వర్షాలు, వరదలు.. 18 మంది మృతి
నేపాల్ : మొన్నటి వరకూ జెన్ జెడ్ ఆందోళనతో అట్టుడికిన దాయాది దేశం నేపాల్.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమౌతోంది. కుండపోత వర్షాలు, పెల్లుబికుతున్న వరదలతో ఇప్పటి వరకూ ఆదేశంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని ఇలమ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. గత 24 గంటల్లో మృతుల సంఖ్య ఈ స్థాయికి చేరడం పరిస్థితికి అద్దం పడుతోంది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కోషి ప్రావిన్స్ పోలీస్ ప్రతినిధి ఎస్‌ఎస్‌పి దీపక్ పోఖ్రేల్ పేర్కొన్నారు. 'వర్షాలు, వరదల కారణంగా కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్రస్తుతం ప్రాథమిక వివరాలు మాత్రమే తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.
ఇలమ్ జిల్లాలోని సూర్యోదయ మున్సిపాలిటీలో 5 మంది, మాంగ్సెబుంగ్ మున్సిపాలిటీలో ముగ్గురు, ఇలమ్ మున్సిపాలిటీలో ఆరు మంది, డెయుమై మున్సిపాలిటీలో ముగ్గురు, ఫాక్‌ఫోక్‌థుమ్ విలేజ్ కౌన్సిల్‌లో ఒక్కరు మరణించారని సదరు అధికారి తెలిపారు.
నేపాల్లో వర్షాకాలం సెప్టెంబర్ చివరి వారంతో ముగిసినప్పటికీ, మళ్లీ వర్షాలు ముంచెత్తడంతో వరదలు, కొండచెరియలు విరిగిపడ్డం తదితర ఉపద్రవాలు సంభవించాయి. ఈ ఏడాది వర్షాలు గట్టిగా పడతాయనే అంచనా ఉన్నప్పటికీ, ఈనెల (అక్టోబర్) లో కురిసిన అకాల వర్షాల కారణంగా ఇంతటి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.
Comments