నిమ్స్ కిటకిట.. 3 రోజుల్లో 11,590 మంది రోగుల రాక
హైదరాబాద్ సిటీ: నిమ్స్ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అవుట్ పేషెంట్ (ఓపీ)కు రద్దీ పెరుగుతోంది. గడిచిన మూడు రోజుల్లో 11,590 మంది రోగులు రాగా, మంగళవారం ఒక్కరోజే 4,055 మంది ఓపీ చికిత్సలు పొందారు. నిమ్స్ ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో రోగులు రావడం ఇదే ప్రథమం. సోమ, మంగళవారాల్లో 133 మంది రోగులు అత్యవసర విభాగంలో చికిత్స పొందారు. సోమవారం నెఫ్రాలజీకి 418 మంది రోగులు వచ్చారు. క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీలకు 397 మంది, న్యూరాలజీకి 363, జనరల్ మెడిసిన్ కోసం 345, ఆర్థోపెడిక్స్ విభాగానికి 347, కార్డియాలజీకి 278 మంది రోగులు చికిత్స కోసం వచ్చినట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప నగరి తెలిపారు. బుధవారం 3,600 మంది వరకు ఓపిలో చికిత్సలు పొందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆన్‌లైన్/వాట్సప్ సేవలు
రోగుల రద్దీకి తట్టుకోవడానికి చర్యలు చేపడుతున్నామని, వారం రోజుల్లో ఆన్‌లైన్/వాట్సప్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. రోగులు వారికి కేటాయించిన సమయం ప్రకారం ఓపీకి వచ్చి చికిత్సలు పొందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే క్యూ పద్ధతిని నివారించడానికి కియోస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం రెండు పనిచేస్తున్నాయని వాటి సంఖ్యను పెంచుతామన్నారు. కియో్‌స్కలోనే ఓపీ రుసుము, ల్యాబ్ రుసుములు చెల్లించే సదుపాయం కల్పించనున్నామని చెప్పారు. అత్యవసర విభాగానికి వచ్చే రోగులను వైద్యుల పరిశీలన వెంటనే ఇంటెన్సివ్ కేర్ నుంచి వార్డులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
త్వరగా శస్త్రచికిత్సలు
రోబో, కీ హోల్ సర్జరీ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండడంతో శస్త్రచికిత్సల అనంతరం త్వరగా డిశ్చార్జి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్య శ్రీ, ప్రభుత్వ ఉద్యోగి ఆరోగ్య స్కీములు, ఇతర సంస్థల ఉద్యోగి ఆరోగ్య శ్రీలకు సంబంధించిన రోగులను త్వరగా డిశ్చార్జి చేస్తున్నట్లు చెప్పారు. ఈ తరహా రోగులే నిమ్స్‌లో 80 శాతం వరకు ఉంటారని బీరప్ప వివరించారు.
ప్రత్యేక ఓపీ బ్లాక్ నిర్మాణ పనులు
నిమ్స్‌కు ఆనుకుని 2 వేల పడకలతో ఏర్పాటు అవుతున్న కొత్త భవనం పనులు వేగిరంగా చేస్తున్నట్లు డాక్టర్ బీరప్ప తెలిపారు. అక్కడ అన్ని సదుపాయలతో ప్రత్యేక ఓపీ బ్లాక్‌ను ఏర్పాటు చేసి, ఆయా విభాగాలను విస్తరిస్తామని, సబ్ స్పెషాల్టీలను ఏర్పాటు చేస్తామని వివరించారు.
Comments