నవంబరు 11 వరకు ఫ్రీ హోల్డ్ పై నిషేధం
అమరావతి : ఫ్రీ హోల్డ్ భూములపై నిషేధం మరో రెండు నెలలు అంటే... నవంబరు 11 వరకు కొనసాగనుంది. బుధవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి నిషేధం మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో గత 15 నెలలుగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్హులకు తక్షణమే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయినా ఆ శాఖ ఫ్రీ హోల్డ్ భూముల సమస్యను సాగదీస్తోంది. గత జగన్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం, అస్మదీయులకు మేలు చేసేందుకు, సెటిల్‌మెంట్ల కోసం అసైన్‌మెంట్ భూములను ఫ్రీ హోల్డ్ చేసింది. నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించడంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం రాగానే వాటి రిజిస్ర్టేషన్లపై నిషేధం విధించింది. గత ప్రభుత్వం చేసిన తప్పు సరిదిద్దుతున్నామని చెప్పింది. అయితే ఇంత వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. జూలై 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలపై చర్చ జరిగింది. రెవెన్యూ శాఖ సమావేశంలో ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ‘‘ఫ్రీ హోల్డ్‌కు అర్హులైన వారు వైసీపీ కార్యకర్తలైనా, టీడీపీ కార్యకర్తలైనా, ఏ పార్టీ వారైనా న్యాయం చేయాల్సిందే.
అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోండి. ఈ విషయంలో ఇక నాన్చుడు ధోరణి వద్దు. అసైనీలు భూమి పొజిషన్‌లో ఉన్నవి, పక్కా అసైన్‌మెంట్ రికార్డులు కలిగి ఉండి 20 ఏళ్ల గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్ చేయండి’’ అని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇలాంటి అర్హత గల భూములు 7 లక్షల ఎకరాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ కూడా గుర్తించింది. కనీసం ఆ భూముల వరకైనా నిషేధం ఎత్తేయొచ్చు. ‘అసైన్‌మెంట్ రికార్డులు లేని భూములు, కలెక్టర్ ఉత్తర్వులు లేనివి, జీవో 596కి విరుద్ధంగా ఉన్నవి, అధిక విస్తీర్ణం క్లెయిమ్ చేసేవి, ఇతరులు క్లెయిమ్ చేసే భూములు, అభ్యంతరాలున్న పోరంబోకు భూములు, నీటి వనరులున్న పోరంబోకు భూములు, 20 ఏళ్ల గడువు దాటని అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ వద్దు’ అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. అయినా కూడా రెవెన్యూ శాఖ అన్ని భూములను ఒకే గాటన కట్టేసి ఏ నిర్ణయం తీసుకోకుండా ఇంకా నాన్చుతోంది. దీన్ని సాకుగా చూపి స్థానిక నాయకులు ఫ్రీ హోల్డ్ భూములపై నిషేధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రచారం చేస్తూ, తక్కువ ధరలకే ఈ భూములు సొంతం చేసుకుంటున్నారు.
నిబంధనల ప్రకారం ఉన్నా...
గత జగన్ ప్రభుత్వంలో 2024 మే నెల నాటికి 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయినట్టు గుర్తించారు. ఇందులో 7 లక్షల ఎకరాలు చట్టప్రకారం, నిబంధనలకు అనుగుణంగా ఫ్రీ హోల్డ్ అయినట్టు రెవెన్యూ శాఖ గుర్తించింది. మరో 5 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగినట్టు పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అక్రమాలపై విచారణ జరుపుతూనే ఉంది. భూ సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంపై ప్రభుత్వానికి అక్టోబరులో తుది నివేదిక అందజేస్తామని చెప్పింది. దీంతో నిబంధనల ప్రకారం సవ్యంగా ఉన్న భూములపై దసరా నాటికి నిషేధం ఎత్తేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు మరో 2 నెలలు నిషేధం పొడిగించారు. దీంతో దసరా, దీపావళి కూడా పోయినా నిషేధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.
Comments