నో డౌట్.. డీఎంకే నిలిపేసిన పథకాలు మళ్లీ ప్రారంభిస్తాం..
చెన్నై: తాము అధికారంలోకి వస్తే డీఎంకే ప్రభుత్వం నిలిపేసిన పథకాలను మళ్లీ ప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. కోవై జిల్లా పొల్లాచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులు, రైతులు, నేత కార్మికులు, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. ఈపీఎస్ ప్రసంగానికి ముందుగా ఆయా సంస్థల తరఫున ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ... అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కల్లు దుకాణాలు ఎందుకు ప్రారంభించలేదని నిలదీయడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అనంతరం ఈపీఎస్ మాట్లాడుతూ... రేషన్ దుకాణాల్లో పామాయిల్‌కు బదులు కొబ్బరి నూనె పంపిణీ చేయాలని, కల్లు గీతకు అనుమతించాలని రైతులు కోరుతున్నారని, దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
కోవై ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేవన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అమలుపరిచిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజకీయకక్ష్య కారణంగా డీఎంకే ప్రభుత్వం అటకెక్కించిందని, వాటిని తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రారంభిస్తామని హామి ఇచ్చారు. సభలో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Comments