ప్రాణం తీసిన శునకం
సత్తుపల్లి : రహదారిపై అడ్డంగా పరుగెత్తిన శునకం.. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణం పోవడానికి కారణమైంది. రోడ్డుపై ద్విచక్రవాహనం(స్కూటర్)లో వెళుతుండగా హఠాత్తుగా ఓ శునకం అడ్డురావడంతో కంగారుపడిన ఓ మహిళ తన వాహనంపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టి తీవ్రంగా గాయపడింది. తన ద్విచక్రవాహనంతో సహా ఆ లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయిన ఆమె అలానే ప్రాణాలు కోల్పోయింది. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సత్తుపల్లికి చెందిన మోరంపూడి స్వర్ణలత (56), రామకోటేశ్వరరావు దంపతులకు కుమార్తె నాగశ్రీ, కుమారుడు నాగశ్యామ్ ఉన్నారు. నాగశ్రీ అమెరికాలో స్థిరపడగా శ్యామ్ హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. బ్రెయిన్ ఆపరేషన్ జరగడంతో రామకోటేశ్వరరావు కొంతకాలంగా ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో స్వర్ణలత వ్యవసాయ పనులు కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దమ్మపేట మండలం రెడ్యాలపాడులోని పామాయిల్ తోటల వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్లిన స్వర్ణలత తిరుగు ప్రయాణంలో తమ్మిలేరు వంతెన ఎక్కుతుండగా ఓ కుక్క అడ్డువచ్చింది. దీంతో వాహనంపై నియంత్రణ కోల్పోయిన స్వర్ణలత.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టారు. లారీ వెనుక భాగంలో ఆమె ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే ప్రాణం విడిచారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.










Comments