• Oct 05, 2025
  • NPN Log

    న్యూఢిల్లీ : ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలను నిలిపివేయకపోతే ప్రపంచపటం నుంచి తుడిచేస్తామంటూ దాయాది పాక్‌ను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్‌లోని అనూ్‌పగఢ్‌లోని సైనిక పోస్టును శుక్రవారం ఆయన సందర్శించారు. ‘ఈసారి వెనక్కి తగ్గేది లేదు. ఆపరేషన్‌ సిందూర్‌ రెండో దశ ఎంతో దూరంలో లేదు. అది 1.0లా ఉండదు. భౌగోళిక పటంలో తన దేశం ఉండాలా వద్దా అనేది పాక్‌ నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ భౌతికంగా అస్తిత్వంలో ఉండాలనుకుంటే రాజ్య ప్రోత్సాహిత ఉగ్రవాదాన్ని తక్షణం కట్టిపెట్టాలి’ అని స్పష్టం చేశారు. భగవంతుడు కోరుకుంటే త్వరలోనే ఆ ‘అవకాశం’ వస్తుందంటూ...ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 కోసం సిద్ధంగా ఉండాలని సైనికులను ఆయన కోరారు.

    ఖబడ్దార్‌: రాజ్‌నాథ్‌ సింగ్‌

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం గుజరాత్‌లోని భుజ్‌ సరిహద్దు ప్రాంతంలో సైనికులతో కలిసి దసరా వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాక్‌పై విరుచుకుపడ్డారు. సర్‌ క్రీక్‌ వద్ద దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని, చరిత్రను..భౌగోళిక స్వరూపాన్నీ మార్చివేస్తామని హెచ్చరించారు. వివాదాస్పద సర్‌ క్రీక్‌ ప్రాంతంలోకి తన సైనిక నిర్మాణాలను పాక్‌ విస్తరిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన ఇలా స్పందించారు. ‘‘1965 యుద్ధంతోపాటు సిందూర్‌ను కూడా పాకిస్థాన్‌ గుర్తుపెట్టుకోవాలి. రెండు సందర్భాల్లోనూ లాహోర్‌ వరకు వెళ్లి మన వాయుసేన తన సత్తా చాటింది. కరాచీకి వెళ్లే రహదారి సర్‌ క్రీక్‌ గుండానే పోతుందనేది దాయాది దేశం మరవొద్దు’’ అని రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. కాగా, సైనికులతో కలిసి ఆయుధ పూజలో పాల్గొన్న ఆయన, సర్‌ క్రీక్‌ ప్రాంతాన్ని శక్తివంతం చేస్తూ నెలకొల్పిన జాయింట్‌ కంట్రోల్‌ సెంటరును, టైడల్‌ బెర్తింగ్‌ వ్యవస్థను ప్రారంభించారు.

    ఏమిటీ సర్‌ క్రీక్‌ వివాదం?

    భారత్‌, పాకిస్థాన్‌ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాల్లో ‘సర్‌ క్రీక్‌’ ఒక ముఖ్యమైన అంశం. వ్యూహాత్మక, ఆర్థిక, భద్రత దృష్ట్యా ఇరు దేశాలకూ ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌, పాకిస్థాన్‌ మధ్య ఉండే సముద్ర తీర ఉప్పు నీటి కాలువనే ‘సర్‌ క్రీక్‌’గా పిలుస్తారు. ఇది 100 కిలోమీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. ‘సర్‌ క్రీక్‌’లో సగం తమదని భారత్‌ వాదిస్తోంది. పాకిస్థాన్‌లో అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన కరాచీకి, అక్కడి పోర్టుకు నేరుగా చేరుకొనేందుకు సర్‌ క్రీక్‌ గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది.

     

     


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement