ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు..
హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన విషయంలో అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎ్‌సలను నాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. బస్టాండ్లలో శుభ్రత, తాగునీటి సౌకర్యం, కుర్చీలు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాటు అంశాలపై సమీక్షించారు. దూరప్రయాణాలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వాతవరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
బస్‌స్టేషన్ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన ఎలక్ర్టిక్ బస్సుల చార్జింగ్ స్టేషన్లు, లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లను పరిశీలించారు. జిల్లాలకు వెళ్లే సర్వీసుల్లో ఎక్కి వాటిలో శుభ్రత, సీటింగ్ సౌకర్యాలు, సాంకేతిక పరిస్థితులను సమీక్షించారు. ప్రయాణికులతో మాట్లాడి వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈడీలు మునిశేఖర్, వెంకన్న, ఖుస్రోషా ఖాన్, సీటీఎం కమర్షియల్ శ్రీధర్, రంగారెడ్డి ఆర్ఎం. శ్రీలతలు పాల్గొన్నారు.
3 నెలల్లో 275 బస్సులు
గ్రేటర్‌జోన్‌లో ఈ డిసెంబర్ నాటికి 3 బస్ డిపోలలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేలా ఆర్టీసీ ప్రణాళికలు రచించింది. మూడు, నాలుగు నెలల్లో విడతల వారీగా గ్రేటర్లో 275 ఎలక్ర్టిక్ బస్సులు రోడ్లపైకి తీసుకురానుంది. ఈమేరకు రాణిగంజ్, పటాన్చెరు, కూకట్పల్లి డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ప్రారంభించాలని భావిస్తోంది. ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, హెచ్‌సీయూ, జేబీఎస్, ఎంజీబీఎస్, హయత్‌నగర్-2, బీహెచ్ఈఎల్ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ ఈ ఏడాది చివరి నాటికి మరో మూడు అందుబాటులోకి తెచ్చేదిశగా చర్యలు చేపడుతోంది.
Comments