• Oct 27, 2025
  • NPN Log

    హైదరాబాద్‌ : హైడ్రోపోనిక్‌ గంజాయి.. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త రకం గంజాయి. ఇటీవల కాలంలో విదేశాల నుంచి హైదరాబాద్‌కు అధికంగా రవాణా అవుతోంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైడ్రోపోనిక్‌ గంజాయితో ప్రయాణికులు పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి శనివారం రాత్రి వరకు.. మూడు నెలల వ్యవధిలో హైడ్రోపోనిక్‌ గంజాయితో ఐదుగురిని శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.53.35 కోట్ల విలువైన 53.35 కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణికులంతా థాయ్‌లాండ్‌ నుంచి వచ్చిన వారు, మహిళలే కావడం గమనార్హం. శనివారం రాత్రి బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలికి చెందిన ట్రాలీ సూట్‌ కేసును తనిఖీ చేసిన డీఆర్‌ఐ అధికారులు 4.15కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికురాలిని అరెస్టు చేశారు. ఇక, వారం క్రితం బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.10 కోట్ల విలువైన 10 కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయి దొరికింది. అంతకుముందు సెప్టెంబరు 5న బ్యాంకాక్‌ నుంచి వచ్చిన మరో మహిళ లగేజీలో రూ.13.9కోట్ల విలువైన 13.9కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, సెప్టెంబరు 20న బ్యాంకాక్‌లో బయలుదేరి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకున్న మరో మహిళ నుంచి 12 కోట్ల విలువైన 12 కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయి దొరికింది.


    ఆగస్టు 11న బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ మహిళ లగేజీలో రూ.13.3 కోట్ల విలువైన 13.3 కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయి లభించింది. ఇలా మూడు నెలల వ్యవధిలో 53.35 కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయి దొరికింది. అంతకముందు జూలైలో బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద ఏకంగా రూ.40 కోట్ల విలువైన 40కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలు అన్నింటిలో పట్టుబడిన వారంతా మహిళలే కావడం, అంతా బ్యాంకాక్‌ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. బ్యాంకాక్‌ నుంచి వస్తున్న మహిళలను మత్తుమందుల స్మగ్లర్లు కొరియర్లుగా వాడుతున్నారని, అందుకే బ్యాంకాక్‌ నుంచి వస్తున్న మహిళా ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు. అయితే, డీఆర్‌ఐ నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని తెలిపారు. కొరియర్లుగా వాడుతున్న మహిళలను బ్యాంకాక్‌ నుంచి నేరుగా కాకుం డా దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌కు పంపిస్తున్నారని చెప్పారు. కాగా, హైదరాబాద్‌ చేరుకున్న మహిళల దగ్గర నుంచి గంజాయిని తీసుకుని ముంబైకి తరలించడానికి మరో నెట్‌వర్క్‌ పనిచేస్తుందని, ఆ నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఉన్నామని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు తెలిపారు. 3 నెలల్లో హైడ్రోపోనిక్‌ గంజాయితో పట్టుబడిన మహిళల్లో నలుగురు ముంబైకి చెందిన వారని పేర్కొన్నారు.

    కిలో రూ.కోటి.. ఏమిటీ హైడ్రోపోనిక్‌ గంజాయి?

    ఒక గ్రాము రూ.10 వేలు.. ఒక కిలో రూ.కోటి.. ఇది హైడ్రోపోనిక్‌ గంజాయి ధర. ఎందుకింత రేటు అని అంటే.. సాధారణంగా గంజాయిని పొలాల్లో, మట్టి నేలల్లో పండిస్తారు. ఇందుకు భిన్నంగా హైడ్రోపోనిక్‌ గంజాయిని ప్రయోగశాలల్లో సాగు చేస్తారు. ప్రత్యేక ల్యాబ్‌ల్లో నియంత్రిత ఉష్ణోగ్రత, తేమల మధ్య పోషకాలను అందించి గంజాయిని సాగు చేస్తుంటారు. ఈ విధానాన్నే హైడ్రో పోనిక్స్‌ అంటా రు. ‘మత్తు వదలరా’ అనే సినిమాలో ఈ గంజాయి సాగు తీరును చూపిస్తారు. సాధారణ గంజాయి మొక్కలతో పోలిస్తే హైడ్రోపోనిక్‌ గంజాయి మొక్కల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. పంట త్వర గా చేతికొస్తుంది. ఈ గంజాయి ఇచ్చే మత్తు కూడా అధికంగా ఉంటుంది. గంజాయిలోని టీహెచ్‌సీ- టెట్రాహైడ్రోకానబినాల్‌ మత్తును ఇస్తుంది. సాధారణ గంజాయితో పోలిస్తే హైడ్రోపోనిక్‌ గంజాయిలో ఈ టీహెచ్‌సీ 30 శాతం అధికంగా ఉంటుంది. ఇక ఈ హైడ్రోపోనిక్‌ గంజాయితో హాష్‌ ఆయిల్‌, హాషిష్‌ కూడా తయారు చేస్తుంటారు. అధిక టీహెచ్‌సీ శాతం కలిగిన హైడ్రోపోనిక్‌ గంజాయి మొక్కల నుంచి తీయడం వల్ల ఈ హాష్‌ ఆయిల్‌, హాషిష్‌ ఇచ్చే మత్తు కూడా అధికంగానే ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement