• Apr 19, 2026
  • NPN Log

    మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో నాచారం ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి జరిపారు. పారిశ్రామిక ప్రాంతాలను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

    నిందితుల వివరాలిలా..

    విశ్వసనీయ సమాచారం మేరకు నాచారం ఎక్సైజ్ పోలీసులు మల్లాపూర్‌లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో ధారావత్ సంతోశ్, సందీప్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి 1.200 కిలోల పొడి గంజాయి, ఒక హోండా యాక్టివా బైక్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. తదుపరి విచారణ కోసం నిందితులను రిమాండ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

    వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ అక్రమ రవాణా..

    పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు ఎండు గంజాయిని కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. భాగ్యనగరంలో గంజాయికి బానిసలైన వారిని గుర్తించి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. మల్లాపూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా వీరు తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

    పోలీసుల హెచ్చరిక..

    గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని నాచారం ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నిఘా పెంచామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఈ గంజాయి ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మత్తు పదార్థాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement