మెరుగుపడని ఉపాధ్యాయుల హోదా
ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలను, వారి హోదా పెంచడానికి 145 అంశాలతో, కొన్ని నిర్దిష్టమైన సిఫార్సులతో 1966లో ‘స్టేటస్ ఆఫ్ ద టీచర్స్’ అనే విధానపత్రాన్ని పారిస్‌లో జరిగిన సమా వేశంలో యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ రూపొందించాయి. ఈ పత్రాన్ని ఆమోదించిన అక్టోబర్ 5వ తేదీని ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం’గా ప్రకటించింది. అయితే ఉపాధ్యాయుల అంతస్తు సాధనకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వారు ఉద్యమించాల్సి వస్తోంది. మానవాభివృద్ధిలో ఉపాధ్యాయులది ప్రముఖ పాత్ర. విద్యా సంబంధ లక్ష్యాలు, ప్రయోజనాల సాధనకు, ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు, గౌరవం తెచ్చేందుకు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. విద్యా రంగానికి, ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన నియామకాలు, ఎంపిక, శిక్షణ, వృత్తి సంబంధమైన ప్రమాణాలు, వృత్తి భద్రత, హక్కులు, బాధ్యతలు, వృత్తిపరమైన స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు పారిస్ సభ సిఫార్సులలో పొందుపరిచారు. వీటితో పాటు వేతనాలు, సెలవులు, స్టడీ లీవు, పనివేళలు, పని పరిస్థితులు, బోధనోపకరణాలు, తరగతి పరిమితి, గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల స్థితిగతులు, మహిళా ఉపాధ్యాయుల పరిస్థితులు, వైద్య సౌకర్యాలు, పెన్షన్‌కు సంబంధించిన అంశాలు వగైరాలు కూడా అందులో ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో విద్య వాణిజ్యీకరణ, ప్రైవేటీకరణ పెరుగుతోంది. విద్యకు కేటాయించే నిధుల పరిమాణం తగ్గిపోతోంది. ప్రభుత్వ విద్యారంగానికి తగ్గిపోతున్న నిధులు, విద్యా ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధుల కేటాయింపు పెంచాలని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉపాధ్యాయులు బోధన వదిలి ఉద్యమించాల్సి వస్తోంది.
ఉపాధ్యాయుని అంతస్తుకు సంబంధించిన ఈ సిఫార్సుల పట్ల చట్టరీత్యా ప్రభుత్వాలు కట్టబడిలేవు. అయినా అవి ఆయా దేశాలపై చెప్పుకోదగ్గ నైతిక రాజకీయ ఒత్తిడిని కలిగిస్తాయి. పారిస్ సభ సిఫార్సులు అమలు జరిపి ఉంటే అనేక దేశాల్లో విద్యారంగం పరిస్థితి మెరుగై ఉండేది. వీటి అమలుకు అంతర్జాతీయ ఉపాధ్యాయ ఉద్యమం, జాతీయ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆయా ప్రభుత్వాలపై తగిన ఒత్తిడి తేలేదు. ప్రపంచవ్యాప్తంగా 9.4 కోట్ల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2030 వరకు ప్రపంచ విద్యా అవసరాలు తీరాలంటే, అందరికీ విద్య అందించాలంటే ఇంకా 4.4 కోట్ల మంది ఉపాధ్యాయులు అవసరం. దేశంలో ఇంకా 10 లక్షల మంది ఉపాధ్యాయుల కొరత ఉందని నీతిఆయోగ్ నివేదిక చెప్తోంది. ‘స్టేటస్ ఆఫ్ టీచర్స్’ విధానపత్రం ఆమోదం పొందిన 60 సంవత్సరాలకు కూడా ఉపాధ్యాయుల పరిస్థితులు హీనస్థితిలో ఉన్నాయని, అధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాలకు ఉపాధ్యాయులు వెళ్లిపోతున్నారని ఐఎల్ఓ నివేదిక చెప్తోంది. ఈ పరిస్థితుల్లో యువత ఉపాధ్యాయ వృత్తి స్వీకరించడానికి స్టేటస్ ఆఫ్ ద టీచర్స్ పత్రంలో సూచించిన విధంగా ఉపాధ్యాయుల అంతస్తు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు గురువులకు ఇచ్చే గౌరవం.
Comments