మరోసారి ట్రిపుల్ ఆర్ కాంబో.. ఇండస్ట్రీ షేక్ అంతే
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 'ట్రిపుల్ ఆర్'లో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ ఏ తీరున మురిపించిందో అందరికీ తెలుసు. ఆ స్థాయిలో ఈ తరం టాప్ స్టార్స్ ఎవరూ కలసి అలరించలేదనే చెప్పాలి. పైగా తారక్, చెర్రీ ఇద్దరి మధ్య సన్నివేశాలు సైతం భలేగా ఆకట్టుకున్నాయి. ఆ మ్యాజిక్ క్రెడిట్ పూర్తిగా రాజమౌళిదే అంటారు చాలామంది. అయితే ఇద్దరు టాప్ స్టార్స్ మధ్య అండర్ స్టాండింగ్ లేకపోతే సీన్స్ అంతలా రక్తి కట్టవనీ చెప్పవచ్చు. దానిని దృష్టిలో పెట్టుకొనే తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ - తారక్- చెర్రీ కాంబోలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించాలని ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలియగానే మళ్ళీ యన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది... ఎందుకంటే వారిద్దరూ నటించిన 'ట్రిపుల్ ఆర్'మూవీలోని "నాటు నాటు..." సాంగ్ తోనే తెలుగువారికి మొట్టమొదటి ఆస్కార్ అవార్డు లభించడం విశేషం.
ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ ఇంతకు ముందు తాను రజనీకాంత్ తో తెరకెక్కించిన 'జైలర్' మూవీ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. 'జైలర్'లోనే రజనీకాంత్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ తో మ్యాజిక్ చేశారు నెల్సన్. రాబోయే 'జైలర్-2'లోనూ మరికొందరు స్టార్స్ ను నటింప చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలోనూ ఓ మూవీ రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే రజనీ-కమల్ కాంబోలో వచ్చే మల్టీస్టారర్ కు క్రేజే వేరుగా ఉంటుందని కోలీవుడ్ జనం అంటున్నారు. అంతటితో ఆగకుండా నెల్సన్ 'ట్రిపుల్ ఆర్' కాంబో తారక్, చెర్రీపై కూడా దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ మధ్యే తారక్, చెర్రీకి నెల్సన్ సబ్జెక్ట్ వినిపించారని, అందుకు వారిద్దరూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని కోలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
తారక్, చెర్రీ కాంబోలో మరో మల్టీస్టారర్ రానుందన్న అంశం వింటూంటేనే ఎంతో ఆసక్తిగా ఉంది. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్'లో వారిద్దరూ చేసిన మ్యాజిక్ అలాంటిది మరి. మళ్ళీ తారక్, చెర్రీని ఒకే సినిమాలో చూస్తే భలేగా ఉంటుందనే వారిద్దరి అభిమానులు సైతం ఆశిస్తున్నారు. అయితే నెల్సన్ ఒకే సమయంలో అటు రజనీకాంత్ - కమల్ హాసన్, ఇటు తారక్ -చెర్రీతో రెండు మల్టీస్టారర్స్ ఎలా ప్లాన్ చేస్తాడు? వినడానికే ఆశ్చర్యంగా ఉందని, అంత నమ్మశక్యంగా లేదనీ కొందరంటున్నారు. పైగా 'జైలర్ 2' ఇంకా పూర్తి కాలేదు. అదయ్యాక ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏది ముందుగా తెరకెక్కుతుంది ? అన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి... పైగా రాజమౌళి సినిమా కాబట్టి తారక్,చెర్రీ మరోమాట లేకుండా 'ట్రిపుల్ ఆర్'లో కలసి నటించారు కానీ, నెల్సన్ మూవీలో అంతలా వారిని కట్టిపడేసే అంశం ఉందా అనీ కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేవో తెలియాలంటే నెల్సన్, తారక్, చెర్రీ ముగ్గురిలో ఎవరో ఒకరు నోరు విప్పాలి. ఒకవేళ నిజమే అయితే నెల్సన్ దశ తిరిగినట్టే అంటున్నారు తెలుగు సినీజనం... ఏమవుతుందో చూద్దాం.









Comments