లొంగు బాట లో మావోయిస్టు హిడ్మా
హైదరాబాద్ : మావోయిస్టు అగ్ర నాయకుడు మడావి హిడుమాయ్ అలియాస్ హిడ్మా అలియాస్ సంతోష్ ఆయుధాలు అప్పగించి లొంగిపోతారని జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఈ ప్రచారాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఖండిస్తున్నప్పటికీ.. హిడ్మా తెలంగాణలో లొంగిపోయే అవకాశాలను తోసిపుచ్చలేమని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ప్లాటూన్-1 కమాండర్‌గా ఉన్న హిడ్మాకు గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుంది. గతంలో హిడ్మా నాయకత్వంలోనే భద్రతా బలగాలపై అనేక దాడులు జరిగాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఛత్తీస్‌గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా.. మల్లా, నిషాద్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టు పార్టీలో చేర్పించారు. వారికి సాయుధ శిక్షణ ఇచ్చి పీఎల్‌జీఏలో చేర్చి... అభేద్యమైన సైన్యంగా తీర్చిదిద్దారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మా.. చాలా సార్లు పోలీసులకు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. అగ్రనేతలు సోనూ, ఆశన్నతోపాటు వందల మంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత హిడ్మా లొంగుబాటు విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హిడ్మా కుమార్తె వంజెం కేషా అలియాస్ జిన్నీ వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. చిన్నప్పటి నుంచి పార్టీ సాంస్కృతిక విభాగంలో పనిచేసిన కేషా.. మావోయిస్టు నాయకుడు రమే్‌షను వివాహం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన కడారి సత్యనారాయణ రెడ్డి భద్రతా బృందంలో సభ్యురాలిగా పని చేశారు. ఆమె భర్త రమే్‌షను 2020లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. హిడ్మా కుమార్తె కేషా... ఆపరేషన్ కగార్ భీకరమవుతున్న క్రమంలో పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాజాగా ఇప్పుడు హిడ్మా సైతం తన అనుచరులతో కలిసి వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.









Comments