• Oct 26, 2025
  • NPN Log

    గత మూడు దశాబ్దాలుగా జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌ చాంబర్‌ భవనం తెలుగు సినీ పరిశ్రమకు ఒక చిరునామాగా మారింది. అక్కడే నిర్మాతల మండలి, నిర్మాతల కోసం నిర్మించిన గదులు, రిక్రియేషన్‌ క్లబ్‌ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొందామంటే గజం భూమి దొరకదు. అలాంటిది ఎకరంపైనే విస్తీర్ణంలో ఉన్న ఫిల్మ్‌ చాంబర్‌ భవనాలపై కొందరి కన్ను పడింది. అక్కడున్న నిర్మాణాలన్నీ కూల్చేసి, బహుళ అంతస్తుల భవనం కట్టాలని వారు సంకల్పించారు. అయితే, తెలుగు సినీ పరిశ్రమకు వారసత్వంగా వస్తున్న చాంబర్‌ భవనాలను కూల్చొద్దని మెజారిటీ సభ్యులు కోరుకుంటున్నారు. వీరి విన్నపాలు వినకుండా ఫిల్మ్‌నగర్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ... ఫిల్మ్‌ చాంబర్‌ పాలక మండలిలో తమకు అనుకూలంగా ఉన్న కొందరితో కలిసి ఏకపక్షంగా భవనాలను కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది. చాంబర్‌ పాలకమండలి గడువు ముగిసినా ఎన్నికలు జరపకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేయడానికి కారణం కూడా కొత్త పాలకమండలి వస్తే బహుళ అంతస్తుల భవనం ప్రతిపాదనకు ఎక్కడ అడ్డం పడుతుందోనన్న భయంతోనే అని సభ్యులు ఆరోపిస్తున్నారు.

    తొలి అడుగులు

    మూడు దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వస్తున్న సమయంలో సినీ పరిశ్రమలో పనిచేసే వారికి ఇళ్ల స్థలాల అవసరాల కోసం ఫిల్మ్‌నగర్‌ సహకార హౌసింగ్‌ సొసైటీ ఏర్పడింది. అదే సమయంలో నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్ల వాణిజ్య అవసరాల కోసం భవంతులు అవసరమయ్యాయి. జి.హనుమంతరావు. రమేష్‌ ప్రసాద్‌, రామానాయుడు, వి.బి.రాజేంద్రప్రసాద్‌, డి.వి.ఎస్‌ రాజు, ఎం.ఎ్‌స.రెడ్డి, సత్యచిత్ర సూర్యనారాయణ మొదలైన సినీ ప్రముఖులు ఉమ్మడిగా చేసిన విజ్ఞప్తి మేరకు హౌసింగ్‌ సొసైటీ రిక్రియేషన్‌ కోసం ఉద్దేశించిన భూమిలో కొంత చాంబర్‌కు లీజుకు ఇచ్చింది. ఇందులోనే చాంబర్‌ కొన్ని భవనాలు నిర్మించింది. నిర్మాణానికి సినీ ప్రముఖులు కూడా కొంత విరాళం ఇచ్చారు. రామనాయుడు పది లక్షలు, అల్లు రామలింగయ్య ఐదు లక్షలు.. ఇలా అనేక మంది ప్రముఖులు తమ వంతు సాయాన్ని ఇచ్చారు. అప్పట్లోనే 1.16 కోట్ల రూపాయల ఖర్చు అయిందని అంచనా. తర్వాత నాలుగేళ్లకు నిర్మాతల మండలికి, మరో 8 మంది నిర్మాతలకుహౌసింగ్‌ సొసైటీ మరికొంత భూమి ఇచ్చి లీజు ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ కొండ మీద ఉన్న స్థలంలో దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఇలా ఈ స్థలమంతా సినిమా ఇండస్ట్రీకి కేంద్ర బిందువుగా మారింది.

    లీజు పూర్తయిందని

    ఈ భూమిని 30 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. లీజు పూర్తయిన తర్వాత ఇరు పక్షాలు సామరస్యంగా లీజును పొడిగించాలా లేదా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలని కూడా ఈ ఒప్పందంలో ఉంది. లీజు వచ్చే ఏడాది ముగుస్తుంది. నిర్మాతల మండలికి, నిర్మాతలకు ఇచ్చిన లీజులు మాత్రం 2030 దాకా ఉన్నాయి. ఇక్కడ భూముల ధరలు ఆకాశానికి అంటిన నేపథ్యంలో హౌసింగ్‌ సొసైటీ మొత్తం భూమిని స్వాధీనం చేసుకొని బహుళ అంతస్తుల భవనాన్ని కట్టాలనే ప్రతిపాదన తెచ్చింది. స్థలంలో చాంబర్‌, నిర్మాతల మండలి కార్యాలయాలు ఉన్నందున వారి అంగీకారం కోసం ఏడాదిగా చాంబర్‌లో, నిర్మాతల మండలిలలో చర్చలు జరుగుతున్నాయి. అయితే, దీనిపై సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు ల్యాండ్‌మార్క్‌గా ఉన్న భవనాలను తీసేయడాన్ని మెజారిటీ సభ్యులు వ్యతిరేకించటం మొదలపెట్టారు. చర్చలు కొనసాగుతుండగానే చాంబర్‌ పాలక వర్గంలో కొందరు హౌజింగ్‌ సొసైటీతో చేతులు కలిపి కూల్చివేతకు అనుకూలంగా పావులు కదిపారని వార్తలు గుప్పుమన్నాయి. చాంబర్‌ అద్దెకు ఇచ్చిన షాపులను, బ్యాంకును ఖాళీ చేయించడం అనుమానాలను బలపరిచింది. ఏం జరుగుతుందో తెలుసుకొనే ప్రయత్నం సభ్యులు చేస్తుంటే చాంబర్‌ పాలక మండలి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ‘‘సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులందరూ ఒకే చోట ఉండాలని ఇచ్చిన స్థలమిది. చాంబర్‌ అనగానే ఈ ప్రాంతం వెంటనే గుర్తుకొస్తుంది. 30 ఏళ్ల కిందట తరలివచ్చిన సినిమా పరిశ్రమకు ఈ భవనం సంకేతం. దీన్ని కూల్చటానికి మేము ఒప్పుకోం. అవసరమైతే కోర్టుకు వెళ్తాం’’ అని చాంబర్‌ సభ్యుడొకరు చెప్పారు.

    ఇచ్చేది కొంతే

    ప్రస్తుతం ఈ స్థలంలో ఉన్న భవనాలలో నిర్మాణ స్థలం 20 వేల చదరపు అడుగులకు మించి ఉండదు. కొత్తగా ప్రతిపాదించిన బహుళ అంతస్తుల భవనంలో 1.70 లక్షల చదరపు అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చాంబర్‌కు, నిర్మాతల మండలికి, ఇతర ఆఫీసులకు రెట్టింపు స్పేస్‌ ఇస్తామని ప్రతిపాదిస్తున్నారు. రెట్టింపు స్థలం ఇచ్చినా 40 వేల చదరపు అడుగులకు మించదు. మిగిలిన స్థలాన్ని ఎలా వాడుతారనే విషయంపై సందిగ్దత నెలకొంది.

     

    లోపాయికారి ఒప్పందాలు

    హౌసింగ్‌ సొసైటీ, చాంబర్‌, నిర్మాతల మండలి పాలక వర్గాల్లో ఉన్న కీలక సభ్యుల మధ్య లోపాయికారి ఒప్పందాలు జరిగాయని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. లీజ్‌ ఒప్పందాల ప్రకారం చూసినా, హౌసింగ్‌ సొసైటీ నియమావళి ప్రకారం చూసినా స్థలాన్ని సినీ రంగాభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని గుర్తు చేశారు. ఫిల్మ్‌నగర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీకి సూపర్‌ స్టార్‌ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా ఉన్నారు. జీవించి ఉన్న కొద్దిమంది పాతతరం ప్రముఖుల్లో ఆయన ఒకరు. సినీ పరిశ్రమ అభివృద్ధిలో ఆయన కూడా ఒక భాగం. ఆయన ఆధ్వర్యంలో ఉన్న సొసైటీ... లీజు సమయం పూర్తి కాకుండానే చాంబర్‌ను ఖాళీ చేయమని ఒత్తిడి పెట్టడం, బహుళ అంతస్థుల ప్రతిపాదన తేవటం దురదృష్టకరమని మరో సభ్యుడు వ్యాఖ్యానించారు.

    భవనం సినీ పరిశ్రమకే ఉండాలి

    చాంబర్‌ భవనాలను కడుతున్న సమయంలో నేను అక్కడే ఉండేవాడిని. అక్కడ కుర్చీలు లేకపోతే మా ఆఫీసు నుంచి తీసుకువెళ్లి వేశాం. పరిశ్రమ ఎదగడంలో భాగంగా మారిన భవంతులను కూలగొడతామంటే బాధగా ఉంది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఈ రోజు ఫిల్మ్‌ నగర్‌ అంటే హైదరాబాద్‌కే ఐకాన్‌. సినీ పరిశ్రమకు కేంద్ర బిందువు. అక్కడ జరిగే ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలో సినీ పరిశ్రమను భాగస్వామ్యం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్‌ హైదరాబాద్‌ను వినోద రంగానికి ప్రపంచంలోనే కేంద్ర స్థానంగా మారుస్తామంటున్నారు. అలాంటప్పుడు ఇక్కడ ఎలాంటి భవంతులు కట్టినా అది తెలుగు పరిశ్రమకు ప్రతిష్టను తెచ్చేదిగా ఉండాలి. దానిలో పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే నిర్వహించుకొనేలా ఉండాలి

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).