వర్జీనియాలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం
అమెరికా (వర్జీనియా): అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని కాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తిరుమలను మరిపించేలా అర్చకులు శ్రీవారి కళ్యాణ క్రతువును కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక పరిసరాలు గోవింద నామాలతో మార్మోగాయి. శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు అమెరికాలో జరుగుతున్నాయా..! అనే రీతిలో అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. ముందుగా స్వామివారికి మంగళ స్నానాలు చేయించి పల్లకి సేవలో ఊరేగింపుగా తీసుకొచ్చారు.
శ్రీనివాస కళ్యాణాన్ని పురస్కరించుకుని వేదికను రంగురంగుల తోరణాలు, పూలతో తీర్చిదిద్దారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు అభిషేకం, అర్చన ఇలా పలు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. సుమారు మూడు వందల మందికి పైగా ప్రవాసాంధ్రుల దంపతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీనివాసుడి కృపకు పాత్రులయ్యారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ హారతులు, వివిధ వాద్యాలు, చిన్నారులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. భక్తి సంగీతంతో అక్కడి వాతావరణం పవిత్రతను సంతరించుకుంది. కళ్యాణ క్రతువు ముగిసిన అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమాల్ని చంద్ర మలవతు, Dr మధుసూదన్ రెడ్డి కాశీపతి సమన్వయ పరిచారు. అనంతరం చంద్ర మలవతు మాట్లాడుతూ.. అమెరికాలో ఉండే శ్రీవారి భక్తులకు తిరుమల వాతావరణాన్ని అందించడం తమ లక్ష్యమని చెప్పారు. ఈ మహోత్సవం విజయవంతం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు సజావుగా జరగడానికి సహకరించిన పండితులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్జినియా కాంగ్రెస్ ప్రతినిధి సుహాస్ సుబ్రహ్మణ్యం, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు.
Comments