వారి వల్లే ఈ విజయం: శుభ్‌మన్ గిల్
క్రికెట్ న్యూస్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా శనివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పై అద్భుత విజయాన్ని అందుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ( 121*)సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74*) అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విజయం సాధించామన్నాడు. ఇది పర్ఫెక్ట్ గేమ్ అని, కెప్టెన్‌గా ఈ విజయం తనకు ప్రత్యేకమైనదని తెలిపాడు.
'రోహిత్ , కోహ్లీ బ్యాటింగ్ అద్బుతమని, బౌలింగ్‌లో హర్షిత్ రాణాతో పాటు స్పిన్నర్లు రాణించారు. మాకు ఇది పర్ఫెక్ట్ గేమ్. మిడిల్ ఓవర్లలోనే మ్యాచ్‌పై పట్టు సాధించాము. మా ఛేజింగ్ చాలా చక్కగా అనిపించింది. మా స్పిన్నర్లు పరుగులు ఇవ్వకుండా ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. పేసర్లు కీలక వికెట్లు తీశారు. మిడిల్ ఓవర్లలో హర్షిత్ రాణా వేగంగా బౌలింగ్ చేశాడు. ఇలాంటి క్వాలిటీ బౌలింగ్ మాకు అవసరం. రోహిత్, కోహ్లీ ఇలాంటి విజయాలు ఎన్నో అందించారు. వారి ఆటను చూడటం చాలా ఆనందంగా ఉంది. సిడ్నీ గ్రౌండ్(Sydney ODI) లో ఈ విజయం దక్కడం గొప్ప అదృష్టం'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 237 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.సెంచరీతో చెలరేగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.









Comments