• Apr 19, 2026
  • NPN Log

    ఏ మహామూలిక గుండెజబ్బులకు గొప్ప ఔషధమో, కుష్ఠు సహా అన్ని చర్మవ్యాధులకు నివారకమో, పక్షవాతం మొదలుకొని నరాల వ్యాధులన్నింటికీ ఉపశమనమో... విరిగిన ఎముకలతో సహా సమస్త ఎముక వ్యాధులను ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుందో, సంతానాన్నిస్తుందో లైంగిక సమర్థతని పెంచుతుందో ఆ మహౌషధి... వెల్లుల్లికి దణ్ణాలు.

     

    ఇమ్యూనిటీ బూస్టర్‌ వెల్లుల్లి

    కాశ్యపసంహిత వైద్యగ్రంథంలో ‘లశునకల్పం’ అనే అధ్యాయమే ఉంది. వెల్లుల్లి ఆయుష్షును పెంచుతుంది, ఊపిరితిత్తుల్లో పేరిన కఫాన్ని కరిగిస్తుంది. జీర్ణశక్తిని, బలాన్ని, లైంగిక శక్తిని పెంపొందిస్తుంది. ఈ కారణాల వల్లే ఆయుర్వేదం వెల్లుల్లిని అమృతంతో సమా నం అన్నది! జీవశక్తినిచ్చే రెజువెనేటర్‌ వెల్లుల్లి.

    వెల్లుల్లి నోటిదుర్వాసనను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కొవ్వును నియంత్రిస్తుంది. దంతాలు, కండరాలు, గోళ్లు, వెంట్రుకలు బల పడేలా చేసి శరీర వర్ణాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను, నాడీవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అలాగే స్త్రీ-పురుషులలో సంతాన వ్యవస్థను బలపరచి సంతానప్రాప్తికి సహాయ పడుతుంది. మేధస్సు పెరుగుతుంది. కంఠస్వరం మెరుగవుతుంది.

    పాలలో ఉడికించిన వెల్లుల్లి తాగితే ఆస్తమా తగ్గుతుంది. క్షయ, న్యుమోనియాలో కఫాన్ని కరిగించి శ్వాస సులభం చేస్తుంది. వెల్లుల్లి రసాన్ని వేడి నీటితో తీసుకుంటే ఉబ్బసం, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

    ఔషధంలా తినాలి!

    వెల్లుల్లిని ఔషధంగా తీసుకున్నప్పుడే దాని ప్రయోజనాలు దక్కుతాయి. రోజుకు రెండు రెబ్బలు ఎక్కువలో ఎక్కువ మోతాదుఅంతకు మించకుండా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. మితిమీరితే ప్రయోజనానికి బదులు హాని కలుగుతుంది. బీ-కాంప్లెక్స్‌ మాత్ర రోజుకొక్కటి వేసుకుంటే బలం. అంతకన్నా ఎక్కువ మింగితే ఎలా ప్రమాదకరమో, అలాగే వెల్లుల్లి అతిగా తింటే గుండె, చర్మం, నరాలు, సంతాన యోగ్యత, లైంగిక సామర్థ్యానికి హాని కలిగించవచ్చు.

    ఒక మనిషికి రోజుకు 1-2 రెబ్బల వెల్లుల్లి ఎక్కువలో ఎక్కువ మోతాదు. అంతకన్నా ఎక్కువగా తినవద్దనే సూచన! వంటకాల్లో వెల్లుల్లి తిననివారు భోంచేశాక 1-2 రెబ్బలు పొట్టు వలిచి, నమలకుండా మింగేయవచ్చు!

    అమృతమే కానీ...

    దేవతల అమృతం భూమిపై చింది వెల్లుల్లి మొలిచిందని ఐతిహ్యం. అది అశుభ్రమైన చోట పడటాన దానికి దుర్వాసన ఏర్పడిందని కథ. సుగంధ ద్రవ్యాలలో వెల్లుల్లి ఉగ్రగంధి. మాంసంలోని దుర్వాసన తొలగించేందుకు ఉపయోగపడ్తుంది. కూరగాయలకు అలాంటి వాసనలేవీ ఉండవు కాబట్టి, శాకాహారంలో దీనికి అంత అవసరం లేదని భావించి శ్రోత్రియులు, శుద్ధ శాకాహారులు సాధారణంగా వెల్లుల్లి వాడరు. ‘‘వెల్లుల్లిం దిలపిష్టమున్‌ మెసవితిన్‌ విశ్వస్త వడ్డింపగా’’ అంటూ వెల్లుల్లి వేసి వండిన తెలికిపిండిని విధవరాలు వడ్డిస్తుంటే తినాల్సి వచ్చిన దౌర్భాగ్యానికి బాధపడ్డాడు శ్రీనాథుడు.

    నేటి కాలంలో విచిత్రంగా వెల్లుల్లి వాడకం మితిమీరింది. ఆఖరికి ఇడ్లీచట్నీలో కూడా వెల్లుల్లి కలిపేస్తున్నారు. రేపు ఇడ్లీలో వెల్లుల్లి కలిపినా ఆశ్చర్యం లేదు. అవధులు దాటిన వేలంవెర్రి ప్రమాదకరం. వెల్లుల్లి అతిగా తిన్న వ్యక్తుల శరీరం నుంచి వెలువడే గవులుకంపు ఇతరులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. పౌర సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారి కెరీర్‌ని కూడా అది దెబ్బతీస్తుంది.

    వెల్లుల్లి మొదట ఔషధ ద్రవ్యమే! వంటిల్లు వెల్లుల్లికి సొంతిల్లు కాదు! 4,500 సంవత్సరాల క్రితం ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణ కాలంలో కార్మికులంతా బలం, ఆరోగ్యం కోసం వెల్లుల్లి తప్పనిసరిగా తినాలని ఒక రాజాజ్ఞ ఉండేదట! అలా వంట గదిలోకి ప్రవేశించింది వెల్లుల్లి. ఆహార పదార్థాల్లో అత్యవసరం అయితేనే వెల్లుల్లిని చేర్చండి. కమ్మగా ఉండే వంటకాల సహజ పరిమళాన్ని వెల్లుల్లి కమ్మేస్తుంది. ఏ కూరతిన్నా వెల్లుల్లి రుచే! అందువలన కూర గాయల సహజ పరిమళాన్ని, రుచిని ఆస్వాదిం చలేకపోతున్నాం! అతి సర్వత్రా వర్జయేత్‌ కదా!

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement