సికింద్రాబాద్‌లో స్టీల్ బ్రిడ్జి
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఉక్కు వంతెన ఏర్పాటు కానుంది. రాజీవ్ రహదారిపై సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట మార్గంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌లో 11.65 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. మన్నికైన, పటిష్టమైన నిర్మాణం, తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తవడం లాంటి ఎన్నో లాభాలు కలిగిన ఈ స్టీల్ బ్రిడ్జి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాణానికి హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. నగరవాసులతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే 18.170 కిలోమీటర్ల ఎలివేటెడ్ ప్రాజెక్టుకు రూ.2,232 కోట్ల వరకు వ్యయం అవుతుందని హెచ్‌ఎండీఏ అంచనా వేస్తోంది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో టెండర్లను ఆహ్వానించడంతో హెచ్‌ఎండీఏ నిర్ణయించిన వ్యయానికి ఏ స్థాయిలో అధికంగా టెండర్ కోట్ చేస్తారోననే ఆసక్తి నెలకొంది. హైదరాబాద్-కరీంనగర్ మార్గంలోని రాజీవ్ రహదారిపై సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట వరకు వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట, తూంకుంట మీదుగా 18.170 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం విషయం తెలిసిందే. దీనిని రూ.2232 కోట్లతో నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వపరమైన పాలన అనుమతులు వచ్చాయి. అయితే 18.170 కిలోమీటర్ల మార్గంలో 11.65 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ రానుండగా.. దీనిని పూర్తిగా ఉక్కుతోనే నిర్మించనున్నారు. పునాదులు మాత్రమే కాంకీట్‌తో నిర్మించి.. వంతెనను పూర్తిగా స్టీల్‌తో నిర్మించేలతా హెచ్‌ఎండీఏ అధికారులు డిజైన్ చేశారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి హకీంపేట వరకు ఈ ఎలివేటెడ్ కారిడార్ రానుండగా.. ఆ తర్వాత హకీంపేట ఆర్మీ ఎయిర్‌పోర్టు వద్ద 450 మీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేయనున్నారు. ఆ తర్వాత ఆరు కిలోమీటర్లకు పైగా రోడ్డు మార్గాన్ని ఆరు లైన్లతో విస్తరించే విధంగా చర్యలు చేపట్టనున్నారు.
Comments