సచివాలయ సిబ్బందికి పీ-4 బాధ్యతలు
అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పీ-4 బాధ్యతలు అప్పగించారు. ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న బంగారు కుటుంబాలకు, వారిని దత్తత తీసుకునే మార్గదర్శులకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. సచివాలయాల పరిధిలో బంగారు కుటుంబాలను క్లస్టర్లుగా విభజించి, వాటికి మ్యాపింగ్ చేశారు. బుధవారం ప్రణాళిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు తమకు కేటాయించిన క్లస్టర్ల పరిధిలోని బంగారు కుటుంబాలతో సమన్వయం చేసుకుంటారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి కనీసం మూడు క్లస్టర్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14,954 సచివాలయాల్లో 1,08,311 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 21,56,637 బంగారు కుటుంబాలను ఎంపిక చేసి, 2,14,084 క్లస్టర్లుగా విభజించారు. ఆయా సచివాలయ ఉద్యోగులకు ఏయే క్లస్టర్లు కేటాయించారో దానికి సంబంధించిన వివరాలను కూడా ప్రణాళిక శాఖ విడుదల చేసింది. మార్గదర్శి, బంగారు కుటుంబాల మధ్య ఉద్యోగులు సమన్వయం చేస్తారు. ఈ బాధ్యతలు ఆయా ఉద్యోగుల విధుల్లో భాగంగా పేర్కొన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన ఆయా కుటుంబాలను కనీసం వారానికి ఒకసారి సంప్రదించాలి. మార్గదర్శుల నుంచి అవసరమైన సహకారాన్ని బంగారు కుటుంబాలకు అందించేందుకు కృషి చేస్తారు. బంగారు కుటుంబాల సమస్యలను మార్గదర్శులకు తెలియజేయడం, అవసరమైనప్పుడు వారికి సహకరించడం చేస్తారు. బంగారు కుటుంబాలు, మార్గదర్శుల మధ్య వ్యవహారాలను జీరో పావర్టీ పీ-4 పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు.
దీనికోసం మొబైల్ /వెబ్ అప్లికేషన్ను అందిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రణాళిక శాఖ పరిధిలో మానిటర్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రణాళిక శాఖదే. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 100 బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేసి, వారి కోసం ప్రత్యేక లాగిన్ క్రియేట్ చేస్తారు. ప్రతి ఉద్యోగి పరిధిలో బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా అలెర్ట్ మెసేజ్ వస్తుంది. ప్రతి సచివాలయ ఉద్యోగి ఎంపీడీఓ పర్యవేక్షణలో పనిచేస్తారు. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖ, ప్రణాళిక శాఖలు పర్యవేక్షిస్తాయి. బంగారు కుటుంబాలు విద్య, వైద్యం, హౌసింగ్, జీవనోపాధి మెరుగుదల తదితర సేవలు పొందుతాయి. ఏదైనా నైపుణ్య శిక్షణలో బంగారు కుటుంబాలను పాల్గొనేలా చూడాలి. మార్గదర్శుల నుంచి స్వీకరించిన సేవలకు సంబంధించిన రికార్డులను నిర్వహించాలి.
Comments