సూది మందు నొప్పీ తెలియదు!
హైదరాబాద్ : సూది మందు అంటే చాలామందికి భయం! చిన్నపిల్లల్లో కొందరైతే మరీనూ! ఇలాంటి పిల్లలకు క్యాన్యు లా పెట్టడమూ సవాలే! ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా వచ్చేసింది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎక్స్‌ఆర్ (ఎక్స్‌టెండెంట్ రియాలిటీ) హెడ్‌సెట్. ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తున్నట్లు, నచ్చిన పనిని చేస్తున్నట్లుగా ఎక్స్‌ఆర్ హెడ్‌సెట్ ఓ కాల్పానిక లోకంలోకి తీసుకెళ్తుంది కాబట్టి ఇంజెక్షన్లు, క్యాన్యులా అంటే భయపడేవారికి, డయాలసిస్ రోగులకు ఎక్స్‌ఆర్ హెడ్‌సెట్ పెడితే ఆ నొప్పి తెలియదని నిపుణులు అంటున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీని గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రిలో శనివారం ఆ ఆస్పత్రుల చైౖర్మన్, ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ఆవిష్కరించారు. అనంతరం పెయిన్ స్కేప్- 2025 సదస్సు లో కిమ్స్ ఆస్పత్రి అసోసియేట్ మెడికల్ డైరెక్టర్, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అంకిత ఆర్.చావ్లా, పెయిన్ మెడిసిన్ డాక్టర్ రణధీర్ అన్నారం మాట్లాడారు. క్యాన్సర్ చికిత్సంలో కీమోథెరపీ వల్ల వచ్చే నొప్పి నివారణకు ఒక్కోసారి మార్ఫిన్ లాంటి మందులూ పెద్ద మోతాదులో ఇవ్వాల్సి వస్తుందని, ఈ హెడ్‌సెట్ వల్ల ఈ సవాళ్లను అధిగమించవచ్చని అంకిత ఆర్.చావ్లా చెప్పారు. కార్యక్రమానికి సీఈవో డాక్టర్ అభినయ్, మెడికల్ ఎడ్యుకేషన్, ఎకడమిక్స్ డైరెక్టర్ డాక్టర్ మణిమాలా రావు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, న్యూఢిల్లీలోని సర్‌గంగారాం ఆస్పత్రి పెయిన్ రిలీఫ్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ జైన్, డాక్టర్ మురళీధర్ జోషి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Comments