సినీ రచయిత ఆకెళ్ళ మృతి
దాదాపు వంద చిత్రాలకు రచన చేసిన ప్రముఖ కథ, మాటల రచయిత ఆకెళ్ళ (ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ) హైదరాబాద్ లో గురువారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఫిబ్రవరి 10, 1950లో ఆకెళ్ళ జన్మిచారు. బాల్యంలోనే నటుడిగా నాటక రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బాలల పత్రికలకు కథలు రాయడంతో రచయితగా ప్రస్థానం మొదలు పెట్టారు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత నాటికలు, నాటకాలు, పద్య నాటకాలు రాశారు.
విజయ బాపినీడు దర్శకత్వం వహించిన చిరంజీవి సినిమా 'మగమహారాజు' తో ఆయన సినీ రచయతగా కెరీర్ ప్రారంభించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'స్వాతిముత్యం, శ్రుతిలయలు, సిరివెన్నెల' చిత్రాలకు ఆకెళ్ళ రచన చేశారు. గీత రచయిత సీతారామశాస్త్రికి స్నేహితుడైన ఆకెళ్ళ... విశ్వనాథ్ కు ఆయన్ని పరిచయం చేసి 'సిరివెన్నెల'కు పాటలు రాసేలా చేశారు. 'ఆడదే ఆధారం, శ్రీమతి ఒక బహుమతి, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, ఔనన్నా కాదన్నా, ఎంత బావుందో' తదితర చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
నరేశ్ హీరోగా ఆకెళ్ళ 'అయ్యయ్యో బ్రహ్మయ్య' చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. నాటక రచయితగా ఆకెళ్ళకు మంచి గుర్తింపు ఉంది. ఆయన రాసిన నాటికలతో మూడు సంపుటాలు విడుదల అయ్యాయి. ఆకెళ్ళ సినీ, నాటక రంగాలకు సంబంధించి మొత్తం 13 నంది అవార్డులు అందుకున్నారు. అలానే ఆయన రాసిన కథలకూ బహుమతులు వచ్చాయి. ఆకెళ్ళ రాసిన తొలి నాటకం 'కాకి ఎంగిలి' సాహిత్య అకాడమీ అవార్డును పొందింది. ఆయన రెండు వందల కథలు, ఇరవై నవలలు, 800 కు పైగా టీవీ ఎపిసోడ్స్ కు రచన చేశారు. అలానే 'అల్లసాని పెద్దన్న, రాణి రుద్రమ, రాణా ప్రతాప్' వంటి చారిత్రక నాటకాలు రాశారు.
ఆకెళ్ళ కు నలుగురు అమ్మాయిలు. ఒక అబ్బాయి. ఆయన భౌతిక కాయానికి శనివారం హైదరాబాద్ నిజాంపేటలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆకెళ్ళ మృతి పట్ల తెలుగు సినీ రచయితల సంఘం తీవ్ర సంతాపం తెలియచేసింది.
Comments