12 పంపులు.. 3,850 క్యూసెక్కులు
కర్నూలు : రాయలసీమ జీవనాడి హంద్రీ నీవా ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు పంపింగ్ స్టేషన్-2 నుంచి 12 పంపుల ట్రయల్ రన్‌ను విజయవంతం చేసిన ఇంజనీర్లు రికార్డు నెలకొల్పారు. దీంతో సీఎం చంద్రబాబు సంకల్పం సాకారమైంది. ఇక్కడినుంచి పూర్తిస్థాయి సామర్థ్యంతో 3,850 క్యూసెక్కులు ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రాజెక్టు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ పాండురంగయ్య, ఈఈ ప్రసాద్‌రావు తెలిపారు. ప్రస్తుతం అవసరాన్ని బట్టి 9నుంచి 10 పంపుల ద్వారా 3,150 నుంచి 3,500 క్యూసెక్కుల కృష్ణా జలాలను ఎత్తిపోస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణపై దృష్టి సారించింది. రూ.3,900 కోట్లతో ఈ ఏడాది మార్చి 15న విస్తరణ పనులు మొదలు పెట్టి జూలై 15 నాటికి 120 రోజుల్లో దాదాపు పూర్తి చేశారు. అదేనెల 17న సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి పంపులు ఆన్ చేశారు. నాటి నుంచి అవసరం మేరకు 7 నుంచి 9 పంపులు రన్ చేస్తూ కృష్ణా వరద జలాలు కరువు పల్లెసీమలకు ఎత్తిపోశారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతుల నుంచి సాగునీటికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఏకకాలంలో ట్రయల్ రన్ కింద 12 పంపులు ఆన్ చేసి విజయవంతంగా 3,850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు.
Comments