• Apr 19, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : ప్రస్తుత యాసంగి సీజన్‌లో తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని (బాయిల్డ్‌ రైస్‌ను) సేకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీని కలిసి వినతిపత్రం సమర్పించారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్‌ రైస్‌కు డిమాండ్‌ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో యాసంగి సీజన్‌లో 90లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ఈ ధాన్యం బాయిల్డ్‌ రైస్‌ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం (5 శాతం నూకతో), 5 లక్షల టన్నుల ముడి బియ్యం (10శాతం నూకతో) సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. బాయిల్డ్‌ రైస్‌ సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. కాగా, 2014 - 15 వర్షాకాలం సీజన్‌లో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1468కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కేంద్రమంత్రిని కోరారు. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు అమలు చేసిన పోషణ్‌ అభియాన్‌ పథకాన్ని ఇటీవల నిలిపివేశారని, దాన్ని వెంటనే పునః ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement