8న జడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. తమ జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను ఈ నెల 8న ప్రకటించనుంది. ఈ అభ్యర్థులను రాష్ట్ర స్థాయిలో పీసీసీ ఖరారు చేయనుంది. ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను డీసీసీల స్థాయిలోనే పరిశీలించి ప్రకటించనున్నారు. కాగా, జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు అర్హులను గుర్తించి ఒక్కో స్థానం నుంచి ముగ్గురి పేర్లతో జాబితాను ఆదివారం (ఈ నెల 5) సాయంత్రానికి పంపాలని ఆయా జిల్లా పార్టీ కమిటీలను పీసీసీ ఆదేశించింది. ఈ విషయంలో ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. స్థానికంగా మంచిపేరు, అందరినీ సమన్వయం చేసుకునే నేర్పు కలిగి, పార్టీ సిద్ధాంతాల పట్ల అంకితభావంతో పనిచేసే నాయకుల పేర్లను సూచించాలని పేర్కొంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా.. ఆయా ప్రాంతాల్లో బీసీల నాయకత్వాన్ని బలపరిచేలా ఈ జాబితాలు ఉండాలని తెలిపింది. కాగా, ఆయా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల నేతృత్వంలో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశాల్లో ఏకాబిప్రాయంతో ఆమోదించిన పేర్లతో రూపొందించిన జాబితాలు ఇప్పటికే పీసీసీకి చేరినట్లు తెలిసింది. ఇక ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల కు సంబంధించి ఎమ్మెల్యేలు, మండల స్థాయి కమిటీల అభిప్రాయాల మేరకు మూడేసి పేర్లను డీసీసీలకు పంపేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పార్టీ నేతలను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం వరకు ఆయా జిల్లాల నుంచి అందిన జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాలను సోమవారం రాష్ట్ర స్థాయిలో పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో సవరించనున్నట్లు తెలిసింది. అనంతరం ఈ నెల 7న పీసీసీ చీఫ్‌తోపాటు ఎన్నికల కమిటీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై ఆయా జిల్లాల నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించి జాబితాపై నిర్ణయం తీసుకుంటారని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
పోటీ తీవ్రంగా ఉంటే సంప్రదింపులతో..!
జడ్పీటీసీ అభ్యర్థిత్వాలకు పోటీ పడే అభ్యర్థుల మధ్య తీవ్రత ఉన్నట్టు గుర్తించిన స్థానాల నుంచి అవసరమైన పక్షంలో జాబితాలో పేర్లున్న వారిని సంప్రదించి ఖరారు చేయనున్నట్టు తెలిసింది. మొత్తంగా ఈ నెల 8వ తేదీ నాటికి జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఒకవేళ ఏ స్థానాలకైనా ఏకాభిప్రాయం కుదరకపోతే.. వాటిని పెండింగ్‌లో పెట్టి నామినేషన్ల ఉపసంహరణ గడువు నాటికి సంప్రదింపులు కొనసాగించి అభ్యరుఽ్థలను ఖరారు చేయాలని టీపీసీసీ యోచిస్తున్నట్టు తెలిసింది. ఇక ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులకు అభ్యర్థులను సంబంధిత మండల స్థాయి కమిటీల సమన్వయంతో డీసీసీ స్థాయిలోనే ఖరారు చేసి ప్రకటించాలని పీసీసీ సూచించింది. ఇదిలా ఉండగా శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట నీలిమ, ఆత్రం సుగుణ, ప్రధాన కార్యదర్శి అంబటి రాజేశ్వర్‌ల ఆధ్వర్యంలో తెలంగాణ శక్తి అభియాన్ కమిటీ సమావేశమై స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించింది.
రిజర్వేషన్ల వివరాలు ఇవ్వండి...
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుల సమగ్ర వివరాల జాబితాను అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను టీపీసీసీ ఎన్నికల విభాగం కన్వీనర్ పి.రాజేశ్‌కుమార్ కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి శనివారం లేఖ రాశారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందుగానే ఆయా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఏర్పాట్లపై అభిప్రాయాలు తీసుకోవడం సంప్రదాయమని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా దశల వారీగా నిర్వహించనున్న స్థానిక ఎన్నికల తేదీల వివరాలు, ఏయే తేదీల్లో ఏయే స్థానాలకు ఎన్నికలు జరుగుతాయో, నామినేషన్లు, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల వివరాలను తమకు అందించాలని విజ్ఞప్తి చేశారు. సానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలకు పలు సందేహాలున్నాయని, నివృత్తి చేయడానికి తక్షణం గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని కోరారు.
Comments